సాగునీటి పంపిణీలోనూ రాజకీయం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి పంపిణీలోనూ రాజకీయం దుర్మార్గం

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం: సాగునీటి పంపిణీ విషయంలోనూ సర్వేపల్లిలో రాజకీయం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి , వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని గొలగమూడి, కురిచెర్లపాడు గ్రామాల్లో బుధవారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు జగనన్న పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నామని, మద్దతు ధర లభించడంతో కల్లాల్లోనే ధాన్యం అమ్ముకుని చాలా సంతోషంగా జీవించామని, కూటమి ప్రభుత్వంలో ఎరువుల ధరలు పెరిగి, గిట్టుబాటు ధరల్లేక నష్టాల ఊబిలో చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరక్కపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో పంటకు సాగునీరు విడుదల విషయంలో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు పంటలకూ ఎలాంటి ఢోకా లేకుండా సాగునీరు అందించామని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన నెల్లూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో సర్వేపల్లి నియోజకవర్గానికి రెండో పంటకు సాగునీరు అవసరం లేదని తేల్చి చెప్పడంతో రైతు సంఘాల నాయకులు తమకు కావాల్సిందేనని సోమిరెడ్డి మాటలకు అడ్డు తగిలిన మాట వాస్తవమన్నారు. రెండో పంటకు నీరు విడుదల చేస్తే దొంగ బిల్లులు చేసుకోవడం సాధ్యం కాదనే దుర్మార్గపు ఆలోచనతో సాగునీరు విడుదల చేయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోందని, ఆక్వా ఫీడ్‌ రేట్లు పెరగడంతో రైతులు ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారన్నారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా , లేకున్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కొణిదెన మోహన్‌నాయుడు, జిల్లా నాయకుడు విజయభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement