ట్రావెల్స్‌ బస్సు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

కావలి: ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వెళ్తూ కావలి శివారు నుంచి జమ్మలపాళెం వరకు బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నాలుగు గేదెలు సైతం చనిపోయాయి. ఈ విషాద ఘటనలు ఆదివారం కావలి మండలం బుడమగుంట క్రాస్‌, జలదంకి మండలం జమ్మలపాళెం మధ్య జరిగాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి నుంచి కలిగిరి వైపు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అతివేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లు (46) కావలికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో డ్రైవర్‌ బస్సును ఆపకుండా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో జమ్మలపాళేనికి చెందిన దేవరపల్లి కొండయ్య గేదెలను మేపుకొని ఇంటికి తోలుకెళ్తుండగా డ్రైవర్‌ అదే వేగంగా వచ్చి ఆరు గేదెలను ఢీకొట్టాడు. దీంతో నాలుగు అక్కడికక్కడే మృతిచెందగా రెండు ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. డ్రైవర్‌ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. కావలి – ఉదయగిరి హైవేపై కర్రలు అడ్డంగా వేయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బస్సు యాజమాని వచ్చి నష్టపరిహారం చెల్లించే వరకు వదిలేది లేదని భీష్మించుకున్నారు. మిగతా వాహనచోదకులు బతిమిలాడినా.. ససేమిరా అనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సును పక్కన పెట్టి రాకపోకలను పునరుద్ధరించారు.

కావలి శివారులో బైకిస్ట్‌ను

ఢీకొనడంతో దుర్మరణం

జమ్మలపాళెం వద్ద ఆరు గేదెలను

ఢీకొట్టడంతో నాలుగు మృతి

గ్రామస్తులు బస్సును అడ్డుకుని ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement