
ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
● విధుల్లో నిర్లక్ష్యంపై
డ్వామా పీడీ గంగాభవాని ఆగ్రహం
పొదలకూరు : ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయకుండా కూలీలకు పనిదినాలు కల్పించకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులను అందజేస్తామని డ్వామా పీడీ గంగాభవాని చెప్పారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పొదలకూరు, కలువాయి, సైదాపురం, రాపూరు మండలాల్లోని ఏపీఎంలు, టీఏలు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పీడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ క్లస్టర్ పనితీరు బాగలేదన్నారు. ఏ మండలంలోనూ లక్ష్యాలను అధిగమించే పరిస్థితి లేదన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి లక్ష్యాలను పూర్తి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లాకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.125 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఈ మొత్తాన్ని రూ.70 కోట్లకు కుదించడం జరిగిందన్నారు. కూలీలకు వేతన బకాయిలు రూ.48 కోట్లు ఉండగా రూ.32 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తం త్వరలోనే చెల్లిస్తామన్నారు.
ఎఫ్‌ఏలు పనిచేయడం లేదు
క్షేత్ర సహాయకులు (ఎఫ్‌ఏలు) గ్రామాల్లో సక్రమంగా పనిచేయడం లేదని డ్వామా పీడీ అభిప్రాయపడ్డారు. కొత్తగా నియామకం జరిగిన ఎఫ్‌ఏలు ఏడాది పూర్తయినా క్షేత్రస్థాయిలో కూలీల వద్ద పనులు చేయించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల వద్ద కనీసం 4 గంటలు పనిచేయిస్తే వారికి రూ.300 గిట్టుబాటు అవుతుందన్నారు. కొన్ని పంచాయతీల్లో పనులే పెట్టడం లేదని, అలాంటి వారికి షోకాజ్ నోటీసులను అందజేసి నెలాఖరు వరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏపీడీ గాయత్రిదేవి, పొదలకూరు ఎంపీడీఓ నరసింహారావు పాల్గొన్నారు.