Smriti Mandhana: 'నా కెరీర్‌లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్‌'

Women T20 WC: Smriti Mandhana Says One-Toughest-Innings I-Have Played - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా స్టార్‌ స్మృతి మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన టి20 కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్‌ ఇదేనని మంధాన మ్యాచ్‌ అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ మధ్యలో వేలికి గాయమైనప్పటికి మంధాన తన జోరును ఎక్కడా ఆపలేదు. మధ్యలో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది.

మ్యాచ్‌ విజయం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ.. ''వర్షం కారణంగా మ్యాచ్‌ జరిగిన సెంట్‌జార్జీ పార్క్‌ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. గాలికి బంతి దిశ మారుతూ వికెట్ల మీదకు దూసుకువస్తుండడంతో బ్యాటింగ్‌ చేయడం కష్టమైపోయింది. బహుశా నా కెరీర్‌లోనే ఇది అత్యంత కఠినమైన ఇన్నింగ్స్‌ అనుకుంటున్నా. వేలికి గాయం అయినప్పటికి పెద్దగా ఏం కాలేదు.. అంతా ఓకే.

షఫాలీ వర్మతో సమన్వయం చేసుకున్నా. ఇద్దరం కలిసి వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే నిశ్చయించుకున్నాం. ఒకరు స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తే సరిపోతుందని భావించాం. అందుకే జాగ్రత్తగా ఆడాం. మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టును సెమీస్‌ చేర్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మేం ఆడాల్సిన పద్దతిలో ఆడలేదు. అందుకే ఓడిపోయాం'' అంటూ చెప్పుకొచ్చింది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్‌ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. 

చదవండి: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్‌ మనదే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top