Who Is Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్‌? ధర కేవలం 20 లక్షలే.. అయినా గానీ!

Who Is Sai Sudharsan All You Need To Know About Gujarat Titans Young star - Sakshi

IPL 2022 - Who Is Sai Sudharshan: ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ ఒక వేదికగా మారింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన భారత యువ ఆటగాళ్లు ఏకంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో దుమ్మురేపిన వారే. 

ఇక ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ యువ ఆటగాళ్లు అదరగొడుతుండటం శుభపరిణామం. ఇప్పటికే అయుష్‌ బదోని, వైభవ్‌ ఆరోరా, తిలక్‌ వర్మ వంటి ఆటగాళ్లు తమ సత్తా చాటుతుండగా.. తాజాగా మరో యువ సంచలనం సాయి సుదర్శన్‌ తన ఆటతీరుతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే సాయి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌
ఐపీఎల్‌-2022లో సాయిసుదర్శన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి సాయిసుదర్శన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 35 పరుగులు సాధించిన సాయి గుజరాత్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. అయితే తొలి మ్యాచ్‌ ఆడుతున్నానన్న భయం సుదర్శన్‌లో అస్సలు కనిపించలేదు. రబడా లాంటి స్టార్‌ బౌలర్‌ బౌలింగ్‌లో సాయి అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌, సాయి ప్రదర్శనకు తోడు ఆఖర్లో రాహుల్‌ తెవాటియా మెరుపులతో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా సాయిసుదర్శన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళనాడుకు చెందిన ఈ యువ ఆటగాడు విజయ్‌ శంకర్‌ స్థానంలో గుజరాత్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో సాయిసుదర్శన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ సాయి సుదర్శన్‌?
సాయి సుదర్శన్‌ ఆక్టోబర్‌ 15, 2001న చెన్నైలో జన్మించాడు.
 సాయి సుదర్శన్‌ దేశవాళీ టోర్నీల్లో తమిళనాడు తరపున ఆడుతున్నాడు.
2021లో ముంబైపై  ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
 సుదర్శన్‌ టీ20ల్లో 2021లో మహారాష్ట్రపై అరంగేట్రం చేశాడు.
లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌ 54 పరుగులు సాధించాడు.
7 టీ20 మ్యాచ్‌ల్లో 182 పరుగులు చేశాడు.
తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే 87 పరుగులు సాధించి తన విలువ చాటుకున్నాడు.
 ఇక తమిళనాడు ప్రీమియర్‌ లీగ్-2021లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌ 358 పరుగులు సాధించాడు.
► ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ. 20 లక్షలకు గుజరాత్‌ సాయి సుదర్శన్‌ను కొనుగోలు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top