
టెస్టు సారథిగా కోహ్లి రికార్డులు ఇవే... రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు!
Virat Kohli Quit Test captaincy : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేశాడు. టెస్టు ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు కోహ్లి శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దాంతో భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా కోహ్లి శకం ముగిసినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్ 16న యూఏఈలో ప్రపంచకప్ ముగిశాక టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లి నవంబర్‌లో ఈ మెగా ఈవెంట్ ముగిశాక తన మాట నిలబెట్టుకున్నాడు.
ఆ సమయంలో కొన్నాళ్లపాటు వన్డే, టెస్టు ఫార్మాట్‌లకు తానే సారథిగా కొనసాగాలని కోహ్లి నిర్ణయించుకున్నాడు. అయితే గత ఏడాది డిసెంబర్ 8న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ మాత్రం మరోలా ఆలోచించింది. టి20 కెప్టెన్సీకి రాజీనామా చేయవద్దని చెప్పినా తమ మాట వినని కోహ్లికి షాక్ ఇచ్చింది. వన్డే ఫార్మాట్‌లో కోహ్లిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ రోహిత్ శర్మను కొత్త కెప్టెన్‌గా నియమించింది.
స్టార్ క్రికెటర్లు లేని దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్‌లో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసింది. అయితే వెన్నునొప్పితో కోహ్లి రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత జట్టు ఓడిపోయింది. మూడో టెస్టులో కోహ్లి కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు ఓటమి చవిచూసి సిరీస్‌ను 1–2తో చేజార్చుకుంది.
విజయవంతమైన కెప్టెన్‌గా...
టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో తొలిసారి కోహ్లి టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ ధోని చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో అడిలైడ్ టెస్టులో కోహ్లికి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఆ సిరీస్‌లోనే మూడో టెస్టు ముగిశాక ధోని టెస్టులతోపాటు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
దాంతో 2015 జనవరి 6 నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో కోహ్లి మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కోహ్లి టెస్టుల్లో భారత రెగ్యులర్ కెప్టెన్ అయ్యాడు. 2015 ఆగస్టులో శ్రీలంకలో పర్యటనలో కెప్టెన్‌గా కోహ్లి తొలిసారి టెస్టు విజయం రుచి చూశాడు. ఆ సిరీస్‌ను భారత్ 2–1తో గెల్చుకుంది. అటు నుంచి ఈ స్టార్ ప్లేయర్ నేతృత్వంలో టీమిండియా వెనుదిరిగి చూడలేదు.
సారథిగా కోహ్లి రికార్డులు
- స్వదేశంలో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు 11 సిరీస్‌లు ఆడగా ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోకపోవడం విశేషం.
- కోహ్లి సారథ్యంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.
- ఏ భారత కెప్టెన్‌కూ సాధ్యంకాని విధంగా విదేశాల్లో కోహ్లి నాయకత్వంలో భారత్ 16 టెస్టుల్లో గెలిచింది.
- 2018–2019లో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
- ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవడంతోపాటు 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
కోహ్లి టెస్టు కెప్టెన్సీలో భారత్ రికార్డు
- ఆడినవి 68
- గెలిచినవి 40
- ఓడినవి 17
- డ్రా 11
- స్వదేశంలో విజయాలు 24
- విదేశాల్లో విజయాలు 16
చదవండి: Kohli Test Captaincy Retirement-Rishab Panth: కోహ్లి రిటైర్‌మెంట్... పంత్‌కు మద్దతుగా నిలిచిన యువీ
కోహ్లి గుడ్ బై
‘దాదాపు ఏడేళ్లపాటు కెప్టెన్‌గా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. నాకిచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ఏదో ఒక రోజున ముగింపు అనేది ఉంటుంది. నా టెస్టు కెప్టెన్సీకి కూడా ముగింపు వచ్చింది. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు.
విజయం కోసం నావంతుగా 120 శాతం కృషి చేశానని నమ్మకంతో చెబుతా. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. కెప్టెన్సీ విషయంలో నాపై ఎంతో నమ్మకముంచిన ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కెప్టెన్సీ కెరీర్‌లో నాకు తోడ్పాటు అందించిన కోచ్ రవిశాస్త్రికి, సహచర క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి కూడా ధన్యవాదాలు. –ట్విట్టర్‌లో కోహ్లి
రోహిత్‌కే అవకాశం...
కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందని ప్రశంసిస్తూ టెస్టు కెప్టెన్సీకి రాజీమానా చేసిన కోహ్లిని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా అభినందించారు. ఇప్పటికే కోహ్లి స్థానంలో భారత టి20, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకే టెస్టు ఫార్మాట్‌లోనూ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!?
►కెప్టెన్‌గా కోహ్లికి దక్షిణాఫ్రికా సిరీస్ చివరిది
Building relationships together on and off the pitch for the better of cricket🙏 #BePartOfIt pic.twitter.com/WNeGNapLCp
— Cricket South Africa (@OfficialCSA) January 16, 2022