Tokyo Olympics: ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి ఆ ఘనత

Tokyo Olympics 2020 Really Succeed In Gender Balancing For First Time - Sakshi

అంతర్జాతీయ క్రీడా వేడుకల వేదిక ఒలింపిక్స్‌కు ఓ చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్రలో వివాదాలు, విమర్శలకు సైతం చోటు దక్కింది. ముఖ్యంగా ఆటల్లో లింగ వివక్ష గురించి ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే వస్తోంది. ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ తొలిసారి ఓ అర్హత సాధించింది. ఇప్పటివరకు రికార్డుకానీ రీతిలో ఫిమేల్‌ అథ్లెట్లతో సందడి చేయబోతోంది ఈ మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌.   
     
సాక్షి, వెబ్‌డెస్క్‌: ‘లింగ సమతుల్యపు ఒలింపిక్స్‌’గా టోక్యో ఒలింపిక్స్‌కి ఓ అరుదైన ఘనత దక్కబోతోంది. విశేషం ఏంటంటే.. ఐదు అగ్ర దేశాలు పురుషుల కంటే మహిళా అథ్లెట్లు పంపించడం. బ్రిటన్‌, యూఎస్‌, చైనా, ఆస్ట్రేలియా, కెనెడాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక రష్యా కూడా ఇదే బాటను అనుసరించింది. చైనా 298 మహిళలు..133 పురుషులు, అమెరికా 329 మహిళలు.. 284 పురుషులు, యూకే నుంచి 376 మంది బరిలోకి దిగుతుండగా  అందులో 201 మంది మహిళలే ఉన్నారు. ఇక కెనడా అయితే 225 మంది మహిళలను.. 145 మంది పురుష అథ్లెట్లను బరిలోకి దింపింది. ఆస్ట్రేలియా నుంచి 471 మంది ఒలింపిక్స్‌లో పోటీపడుతుండగా.. 252 మంది మహిళలు, 219 మంది పురుషులు ఉన్నారు. రష్యా నుంచి మొత్తం 329లో 183 మంది మహిళలు, 146 మంది పురుషులు పాల్గొంటున్నారు. 

అధికారికంగా ప్రకటన
ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)అధికారికంగానే టోక్యో ఒలింపిక్స్‌ను జెండర్‌ బ్యాలెన్స్డ్‌ ఒలింపిక్స్‌గా ప్రకటించింది. అంతేకాదు ఆరంభ వేడుకల్లో జెండా మోయడం దగ్గరి నుంచి అది ప్రారంభం కావాలని అభిప్రాయపడింది. లింగ సమానత్వం లక్క్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొంది. ఇక ఈ దఫా 49 శాతం మహిళలు, 51 శాతం పురుషులు ఇందులో పాల్గొంటున్నారని ప్రకటించింది. భారత్‌ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, 56 మంది మహిళలే ఉన్నారు. ఆతిథ్య జపాన్‌ మాత్రం 259 మహిళలు, 293 పురుషులతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

అయితే.. 
మొత్తం ఈసారి 48.8 శాతం మహిళా పోటీదారులు పాల్గొనబోతున్నారు. అంటే.. అది 50 శాతం కంటే తక్కువగా ఉందన్నమాట. ఆ లెక్కన ఐవోసీ లక్క్ష్యం సాధనకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఒలింపిక్స్‌ చరిత్రను పరిశీలిస్తే.. ఆధునిక మొదటి ఏథెన్స్‌ ఒలింపిక్స్‌(1896)లో మహిళలను పాల్గొనకుండా నిషేధించారు. అయితే 1900 ప్యారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి మహిళా అథ్లెట్లను అనుమతిస్తున్నారు. అందులో మొత్తం 997 మంది పోటీదారుల్లో 22 మంది మాత్రమే మహిళలు(ఐదు ఈవెంట్స్‌) ఉన్నారు.

*2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళా అథ్లెట్ల శాతం 44.2
*2016 రియో ఒలింపిక్స్‌ పాల్గొన్న వాళ్ల శాతం 45 (టోక్యో వరకు మెరుగైన ఫలితమే కనిపిస్తోంది)
*రియో పారాఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళల శాతం 38.6
*టోక్యో పారాఒలింపిక్స్‌లో అది 40.5 శాతంగా ఉండబోతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top