
భారత మహిళల హాకీ జట్టు ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మహిళల హాకీ జట్టు నిరాశపరిచింది. నెదర్లాండ్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-5తేడాతో ఓటమి పాలైంది. ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే నెదర్లాండ్స్ ప్లేయర్ ఫెలిస్ అల్బర్స్ గోల్ చేసి, తన జట్టుకి తొలి గోల్ అందించింది. అయితే 10వ నిమిషంలో భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ చేసి స్కోరును 1-1 తేడాతో సమం చేసింది. 33వ నిమిషంలో మార్గాట్ జెఫెన్ గోల్ చేయగా, 43వ నిమిషంలో ఫెలిస్ అల్బర్స్, 45వ నిమిషంలో ఫెడేరిక్ మట్లా వరుస గోల్స్ చేయడంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి 4-1 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది నెదర్లాండ్. నాలుగో క్వార్టర్‌లో 52వ నిమిషంలో వాన్ మసక్కర్ గోల్ చేయడంతో 1-5 తేడాతో నెదర్లాండ్ జట్టు మ్యాచ్‌ను ముగించింది
తొలి రౌండ్‌లోనే ఓడిన భారత బాక్సర్ వికాస్ కృష్ణన్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. 69 కేజీల మెన్స్ బాక్సింగ్ విభాగంలో జపాన్‌కి చెందిన ఒకాజవా మెన్షాతో జరిగిన మ్యాచ్‌లో వికాస్ కృష్ణన్ మూడు రౌండ్లలో ఓడి, ఒలింపిక్స్ నుంచి నిష్కమించాడు. రక్తం కారుతున్నా చివరిదాకా పోరాడిన వికాస్ కృష్ణన్, జపాన్ బాక్సర్ జోరు ముందు నిలవలేక 5-0 తేడాతో ఓడాడు.
టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బాత్రా శుభారంభం
►ఒలింపిక్స్‌లో భాగంగా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో మనికా బత్రా శుభారంభం చేసింది. 30 నిమిషాల పాటు జరిగిన నాలుగు గేముల్లో వరుసగా 11-7, 11-6, 12-10, 11-9తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది
మీరాబాయి చానుకు రజతం
►టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్ జిజోయ్ పసిడిని దక్కించుకున్నారు. భారత్ తరపున పతకం సాధించిన రెండో వెయిట్ లిఫ్టర్‌గా మీరాబాయి ఘనత సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్‌గా మీరాబాయి నిలిచారు. రజతం సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు శుభాకాంక్షలు తెలిపారు. మీరాబాయి చాను విజయం ప్రతీ ఒక్క భారత ఆటగాడిలో స్ఫూర్తి నింపుతుందని మోదీ ట్వీట్ చేశారు.
► టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం సాధించిన మీరాబాయి చానుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా అభినందించారు. '' మీ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. గాయం నుంచి కోలుకొని ఒలింపిక్స్‌కు సిద్ధమైన తీరు అద్భుతం. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి మరింత గర్వపడేలా చేశారు. కంగ్రాట్స్ మీరాబాయి'' అంటూ ట్వీట్ చేశారు.
చిరాగ్- సాత్విక్ జోడి శుభారంభం
► భారత పురుషుల బాడ్మింటన్ డబుల్స్ విభాగంలో పదో సీడ్ చిరాగ్- సాత్విక్ సాయిరాజ్ జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో భాగంగా చైనీస్ తైపీకి చెందిన మూడో సీడ్ లీ యాంగ్- వాంగ్ చీ లీన్ జంటపై 69 నిమిషాల పాటు జరిగిన మూడు గేముల్లో 16-21, 21-16, 25-27తో గెలిచి రెండో రౌండ్‌కు వెళ్లారు.
►ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్ జంట కొరియా చేతిలో 2-6 తో ఓడిపోయి నిష్క్రమించింది. నాలుగు సెట్లుగా జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కొరియా గెలుచుకోగా.. మూడోది భారత్ గెలుచుకుంది. చివరిదైన నాలుగో సెట్‌ను కొరియా గెలవడంతో సెమీస్‌కు చేరుకుంది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్ట్‌ల్ విభాగంలో సౌరభ్ చౌదరీకి నిరాశ
►పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్స్‌లో నిరాశపరిచాడు. ఫైనల్ రౌండ్‌లో 7వ స్థానంలో నిలిచిన అతను పతకం సాధించే అవకాశం కోల్పోయాడు. అంతకముందు పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ ఆరు రౌండ్లు కలిపి మొత్తం 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఫైనల్స్‌లో కూడా సౌరభ్ ఇదే ప్రదర్శన చేసి ఉంటే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం వచ్చేది. ఇక మరో భారత షూటర్ అభిషేక్ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచాడు.
►బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా సాయిప్రణీత్ ఓటమి పాలయ్యాడు. ఇజ్రాయెల్ ఆటగాడు మిషాతో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో 17-21,15-21 తేడాతో పరాజయం పాలైంది.
టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్:
►టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ నిరాశపరించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌పై చైనీస్ తైపీ గెలుపొందింది. శరత్ కమల్, మనికా బత్రా జంట .. చైనీస్ తైపీ చేతిలో 4-0 తేడాతో ఓటమి పాలైంది.
► టోక్యో ఒలింపిక్స్‌లో భారత పరుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
►ఆర్చరీ మిక్స్‌డ్ విభాగం:
ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్ క్వార్టర్స్ చేరింది. తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ విజయం. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడే అవకాశం.
దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్
చైనాదే తొలి పతకం
►టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని చైనా దక్కించుకుంది. 10 మీటర్ల షూటింగ్ ఎయిర్‌రైఫిల్ విభాగంలో చైనాకు చెందిన యాంగ్ కియాన్ 251.8 పాయింట్లతో స్వర్ణం సాధించగా.. రష్యాకు చెందిన అనస్తాసియా గలాషినా 251.1 పాయింట్లతో రజతం.. స్విట్జర్లాండ్‌కు చెందిన నైనా క్రిస్టిన్ 230.6 పాయింట్లతో క్యాంస్యం దక్కించుకుంది.
ఎలవెనిల్ వలరివన్
► పతకం ఖాయమనుకున్న 10 మీటర్ల షూటింగ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళ షూటర్లు ఎలవెనిల్ వలరివన్, అపూర్వ చండీలాలు నిరాశపరిచారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో భాగంగా 6 రౌండ్లలో ఎలవెనిల్ వలరివన్ 626.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా.. అపూర్వ చండీలా 621.9 పాయింట్లతో 36వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్ రౌండ్ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ మెడల్ ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది.
ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ షెడ్యూల్
రెండో రోజు 10 విభాగాల్లో పోటీపడుతున్న భారత క్రీడాకారులు
ఉ.6 గంటలకు ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో దీపికా, ప్రవీణ్ జాదవ్
చైనీస్ తైపీ క్రీడాకారులు చియా ఎన్‌లిన్, చున్‌టాంగ్‌తో దీపీకా, ప్రవీణ్ పోటీ
ఉ.6.30కి భారత్- న్యూజిలాండ్ హాకీ మ్యాచ్
ఉ.7.15కి షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిల్ పిస్టల్ ఫైనల్
ఉ.7.30కి జూడో 48 కిలోల విభాగంలో మహిళల మ్యాచ్
ఉ.7.30 గంటలకు టెన్నిస్ పురుషుల సింగిల్స్
ఉ.8.30 గంటలకు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్
ఉ.8.50కి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్-ఎ మ్యాచ్
ఉ.9.30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మ్యాచ్
ఉ.9.30కి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్-డి మ్యాచ్
ఉ.10.20కి వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కిలోల ఈవెంట్
మ.ఒంటిగంటకు టేబుల్ టెన్నిస్: భారత్ Vs స్వీడన్
సా.5.30కి మహిళల హాకీ: భారత్ Vs నెదర్లాండ్స్
నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11)
ఆర్చరీ (1)
రోడ్ సైక్లింగ్ (1)
ఫెన్సింగ్ (2)
జూడో (2)
షూటింగ్ (2)
తైక్వాండో (2)
వెయిట్‌లిఫ్టింగ్ (1)