T20 WC 2021 SA Vs BAN: దక్షిణాఫ్రికా ధమాకా.. సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో

T20 World Cup 2021: South Africa Beat Bangladesh By 6 Wkts Close Semifinal - Sakshi

బంగ్లాదేశ్‌ను 84 పరుగులకే కుప్పకూల్చిన సఫారీ జట్టు

6 వికెట్లతో గెలిచి సెమీస్‌కు చేరువ

హడలెత్తించిన రబడ, నోర్జే  

అబుదాబి: ఆరు పటిష్ట జట్లున్న గ్రూప్‌–1లో వరుసగా మూడో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. వరుసగా మూడు పరాజయాలు చవిచూసి ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్‌ రేసు నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌ తమ ఖాతాలో మరో ఓటమిని జమ చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబడ (3/20), అన్రిచ్‌ నోర్జే (3/8) హడలెత్తించారు. దాంతో బంగ్లాదేశ్‌ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్‌ (25 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌), లిటన్‌ దాస్‌ (36 బంతుల్లో 24; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్‌ బవూమ (28 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వాన్‌డెర్‌ డసెన్‌ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. రబడకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.   

చదవండి: SA Vs BAN: బౌలర్ల విజృంభణ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

సఫారీ జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను రబడ ఆరంభంలోనే దెబ్బ తీశాడు. వరుస బంతుల్లో నైమ్‌ (9), సౌమ్య సర్కార్‌ (0) వికెట్లతో పాటు తన తర్వాతి ఓవర్‌లో కీలకమైన ముష్ఫికర్‌ రహీమ్‌ (0)ను కూడా అవుట్‌ చేసి బంగ్లాదేశ్‌ను కోలుకోకుండా చేశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ (4) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. మూడు ఫోర్లు కొట్టి దూకుడు మీదున్నట్లు కనిపించిన క్వింటన్‌ డికాక్‌ (16; 3 ఫోర్లు), మార్క్‌రమ్‌ (0) వెంట వెంటనే అవుటయ్యారు. బవూమ, డసెన్‌ జట్టును విజయంవైపు నడిపారు. వీరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. చివర్లో డసెన్‌ అవుటైనా... ఫోర్‌తో డేవిడ్‌ మిల్లర్‌ (5; 1 ఫోర్‌) ఛేదనను పూర్తి చేశాడు.  

సంక్షిప్త స్కోర్లు : బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: 84 ఆలౌట్‌ (18.2 ఓవర్లలో) (లిటన్‌ దాస్‌ 24, షమీమ్‌ 11, మెహదీ హసన్‌ 27, రబడ 3/20, నోర్జే 3/8, షమ్సీ 2/21); దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: 86/4 (13.3 ఓవర్లలో) (డికాక్‌ 16, డసెన్‌ 22, బవూమ 31 నాటౌట్, తస్కిన్‌  2/18).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top