On This Day In 1993: Shane Warne Delivers Iconic Ball Of The Century, ICC Shares Photo - Sakshi
Sakshi News home page

Shane Warne Ball Of The Century: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్‌

Jun 4 2022 11:29 AM | Updated on Jun 4 2022 2:00 PM

Shane Warne Iconic Ball Of The Century On This Day ICC Shares Photo - Sakshi

షేన్‌ వార్న్‌ విజయానందం(ఫైల్‌ ఫొటో- కర్టెసీ: ICC)

Ball Of The Century : ‘‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ది సెంచరీని చూసింది’’ అంటూ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్‌, దివంగత షేన్‌ వార్న్‌ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. కాగా 1993 యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌లో పర్యటించింది.

ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా జూన్‌ 3 తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 289 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్‌ గ్రాహమ్‌ గూచ్‌ శుభారంభం అందించాడు. 65 పరుగులతో జోరు మీదున్న సమయంలో వార్న్‌ అతడిని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత  రెండో రోజు(జూన్‌ 4) వన్‌డౌన్‌లో వచ్చిన మైక్‌ గాటింగ్‌ను అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. 

బాల్‌ను నేరుగా గాటింగ్‌ కాళ్ల ముందు వేసి.. ఆఫ్‌ వికెట్‌ను ఎగురగొట్టాడు. అసలు బంతి ఎక్కడ పడుతుందో బ్యాటర్‌ అంచనా వేసే లోపే ఈ విధంగా అద్భుతం చేశాడు వార్న్‌. దీంతో గాటింగ్‌ సమా అంపైర్‌ కూడా బిక్కమొహం వేశారంటే ఈ స్పిన్‌ మాంత్రికుడి మాయాజాలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిని బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా పేర్కొంటూ వార్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వికెట్లు పడగొట్టిన వార్న్‌.. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో నాటి మొదటి టెస్టులో ఆసీస్‌ 179 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా ఆరు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌ను గెలిచి ప్రతిష్టాత్మక యాషెస్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది మార్చి 4న షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్‌లాండ్‌లోని విల్లాలో విగతజీవిగా కనిపించాడు.

1993 యాషెస్‌ సిరీస్‌: ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మొదటి టెస్టు స్కోర్లు
ఆస్ట్రేలియా: 289 & 432/5 డిక్లేర్డ్‌
ఇంగ్లండ్‌: 210 & 332.
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షేన్‌ వార్న్‌

చదవండి: T20 WC 2022: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్‌ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement