Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరు!

Sanjay Manjrekar Says No Bowler In World Today Has Any Answer To SKY - Sakshi

Ind Vs Eng T20 Series: టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుత షాట్లతో విరుచుకుపడే సూర్యను కట్టడి చేయగల బౌలర్‌ ప్రస్తుతం ఎవరూ లేరంటూ కొనియాడాడు. అతడికి ఎలా బౌలింగ్‌ చేయాలో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నాడు.

కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది మార్చిలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ఇంగ్లండ్‌తో టీ20 ఫార్మాట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ను స్సిర్‌తో మొదలు పెట్టి 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి సత్తా చాటాడు.  

క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోనూ ముంబై ఇండియన్స్‌లో కీలక బ్యాటర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒకటీ రెండూ మినహా వచ్చిన అవకాశాలన్నీ దాదాపుగా సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టీ20లో సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 117 పరుగులు సాధించి పొట్టి ఫార్మాట్‌లో తొలి శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఈ నేపథ్యంలో సంజయ్‌ మంజ్రేకర్‌ స్పోర్ట్స్‌18తో ముచ్చటిస్తూ సూర్యకుమార్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘సూర్య సెంచరీ ఓ మధుర జ్ఞాపకం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రైక్‌ రేటు(212.73). క్లాసిక్‌ ఇన్నింగ్స్‌. ప్రస్తుతం తన బ్యాటింగ్‌కు ఎదుర్కోగల సమర్థవంతమైన బౌలర్‌ ఎవరూ లేరని చెప్పొచ్చు’’ అని పేర్కొన్నాడు.

ఇక సూర్యకు స్టాండింగ్‌ ఓవియేషన్‌ లభించడంపై స్పందిస్తూ.. ‘‘సెంచరీ తర్వాత ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అతడిని అభినందించారు. నిజానికి కేవలం టీమిండియా అభిమానులు మాత్రమే కాదు.. ఇంగ్లండ్‌ జట్టు మద్దతుదారులు సైతం అతడిని కొనియాడారు. ఈ మ్యాచ్‌లో సూర్య ఇన్నింగ్స్‌ కారణంగా తాము ఓడినా సరే పర్వాలేదన్నట్లుగా ఒక ఆటగాడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇచ్చారు’’ అని మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు.

చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌! ఇంకా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top