17 ఏళ్లకు జాతీయ స్థాయిలో దూసుకొచ్చిన కుర్రాడు.. బ్యాడ్మింటన్‌లో ప్రకాశం

Sakshi Funday Special Story On Prakash Padukone

అచీవర్స్‌

దాదాపు యాభై ఏళ్ల క్రితం..  దక్షిణ భారతదేశంలో బ్యాడ్మింటన్‌ అంటే బాల్‌ బ్యాడ్మింటన్‌ మాత్రమే! దిగువ స్థాయిలో గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయి.. ఆటంటే బాల్‌ బ్యాడ్మింటన్‌ మాత్రమే అనేంతగా పరిస్థితి కనిపించేది. నగరాల్లో కూడా  ‘షటిల్‌ బ్యాడ్మింటన్‌ ’ గా పిలుచుకునే ఆటకు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇలాంటి స్థితిలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు జాతీయ స్థాయిలో దూసుకొచ్చాడు.

నేపథ్యం కారణంగా తొలి అవకాశం తొందరగానే లభించినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అతనికి పదేళ్లు పట్టింది. ఆ విజయం తర్వాత అతను ఆగలేదు. దేశంలో బాడ్మింటన్‌ ఆటకే దిక్సూచిగా మారాడు. ఒక దేశంలో ఒక క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెట్టగానే అందరికంటే ముందుగా ఒక పేరు స్ఫురిస్తుందంటే ఆ ఆటగాడు సాధించిన ఘనత ఏమిటో, ఆ ఆటకు అతను తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు.  అతని పేరే ప్రకాశ్‌ పడుకోణ్‌.. భారత బ్యాడ్మింటన్‌కు తొలితరం చిరునామా.

ప్రకాశ్‌ పడుకోణ్‌ కంటే ముందు కూడా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింట¯Œ లో కొన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన దినేశ్‌ ఖన్నా తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్‌ ఎక్కువ భాగం ఆసియాకే పరిమితమైంది. 60, 70వ దశకాల్లో బ్యాడ్మింటన్‌ లో చైనా ఆధిపత్యం లేదు. అలాంటి సమయంలో దినేశ్‌ ఆసియా స్థాయిలో విజేతగా నిలిచినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో బ్యాడ్మింటన్‌ అడ్డా యూరోప్‌ మాత్రమే.

ఇంగ్లండ్, డెన్మార్క్‌లతో పాటు ప్రతిష్ఠాత్మక యూరోపియన్‌ లీగ్‌లు, క్లబ్‌లలో బ్యాడ్మింటన్‌ హవా నడిచేది. విజయాలు సాధించిన వారికే అక్కడ అందలం. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్‌ పడుకోణ్‌ మిగతావారి కంటే భిన్నంగా నిలిచాడు. ఒక వైపు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే యూరోప్‌లో సత్తా చాటడంతో ప్రకాశ్‌ ప్రత్యేకత కనిపించింది. 

కఠోర శ్రమతో..
ప్రకాశ్‌ తండ్రి మైసూరు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా పని చేస్తుండటంతో సహజంగానే ప్రకాశ్‌కి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే ఆటలో పదును ఉంటేనే మున్ముందు అవకాశాలు దక్కుతాయని త్వరలోనే ప్రకాశ్‌కి అర్థమైంది. 1962లో అమితోత్సాహంతో రాష్ట్ర స్థాయి జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ బరిలోకి దిగిన అతను తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల శ్రమతో అదే టైటిల్‌ గెలుచుకున్నాడు.

అయినా సరే, ప్రకాశ్‌ ఆట ఉత్తరాది షట్లర్లతో పోలిస్తే ఇంకా పేలవంగానే ఉండేది. జాతీయ స్థాయికి ఎదగాలంటే అది సరిపోదని గ్రహించాడు. అందుకే తన ఆట శైలిని మార్చుకున్నాడు. దూకుడును పెంచి ప్రత్యర్థిపై చెలరేగేందుకు తగిన అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. అయినా సరే.. రాష్ట్ర స్థాయి విజేత నుంచి జాతీయ స్థాయికి చేరేందుకు ప్రకాశ్‌కు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో అతణ్ణి ఎన్నో పరాజయాలు పలకరించాయి. పట్టుదలగా నిలబడ్డాడు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.

ఫలితంగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి జాతీయ జూనియర్‌ టైటిల్‌ ప్రకాశ్‌ చేతికి చిక్కింది. అప్పటికే.. పదునెక్కిన ప్రకాశ్‌ ఆట సీనియర్లనూ నిలువరిస్తోంది. దాంతో జూనియర్‌ చాంపియన్‌ గా మారిన సంవత్సరమే పడుకోణ్‌ జాతీయ సీనియర్‌ చాంపియన్‌ గానూ మారాడు. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఏడు సంవత్సరాల పాటు ప్రకాశ్‌ జాతీయ చాంపియన్‌ గా నిలబడ్డాడు.

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణంతో..
భారత బ్యాడ్మింటన్‌ లో శిఖరానికి చేరాక ప్రకాశ్‌ తర్వాతి అడుగు అంతర్జాతీయ టోర్నీల వైపే. 1974 టెహ్రాన్‌ ఆసియా క్రీడల్లో టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించినా.. వ్యక్తిగత విభాగంలో విజయాలకు హైదరాబాద్‌ నగరమే తొలి వేదికగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆసియా చాంపియన్‌ షిప్‌లో 21 ఏళ్ల ప్రకాశ్‌ కాంస్యం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత రెండేళ్లకు కెనడాలోని ఎడ్మాంటన్‌ లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల సింగిల్స్‌లో స్వర్ణపతకంతో మెరిశాడు. వరుసగా రెండు వరల్డ్‌ కప్‌లలో పతకాలు, వరల్డ్‌ గేమ్స్‌తో పాటు ఆసియా చాంపియన్‌ షిప్‌లో మరో పతకంతో ప్రకాశ్‌ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అప్పటికే బ్యాడ్మింటన్‌ అంటే దేశంలో ఒక్క ప్రకాశ్‌ పడుకోణ్‌ పేరు మాత్రమే వినిపించేంతగా ప్రసిద్ధికెక్కాడు. 

యూరోప్‌ గడ్డపై..
వేర్వేరు అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సమయంలో ప్రకాశ్‌ ప్రత్యర్థుల ఆటపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా యూరోప్‌ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆట చాలా వెనుకబడి ఉన్నట్లు  గ్రహించాడు. అప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో మార్పు తీసుకురాకపోతే వెనుకబడి పోతాననీ అర్థంచేసుకున్నాడు. యూరోప్‌ వెళ్లి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

అయితే  శిక్షణ అంటూ వెళితే ఫలితం ఉండదని.. వీలైనన్ని ఎక్కువ టోర్నీలకు ఆడటంతో ఆటను సానబెట్టుకోవచ్చని అత్యంత సన్నిహితులు అతనికి సూచించారు.  దాంతో తన మకాంను యూరోప్‌కు మార్చుకున్నాడు ప్రకాశ్‌. ఇంగ్లండ్, డెన్మార్క్, స్వీడన్‌ , నెదర్లాండ్స్‌.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి క్లబ్‌లలో ఆడుతూ పోయాడు. అతను ఆశించినట్లుగానే అతని ఆట పైస్థాయికి చేరుకుంది. 1979లో లండన్‌ లో ‘ఈవెనింగ్‌ ఆఫ్‌ చాంపియన్స్‌’ టోర్నీలో విజయంతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఆట చివరకు ఒక చరిత్రాత్మక గెలుపుకి బాటలు వేసింది. 

కొనసాగిన విజయపరంపర
ఆల్‌ ఇంగ్లండ్‌ గెలిచిన తర్వాత ప్రకాశ్‌కు స్వదేశంలో లభించిన స్వాగతం, పెద్ద ఊరేగింపుతో జరిగిన పౌర సన్మానం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ విక్టరీ తర్వాత అతని స్థాయి మరింత పెరిగిపోయింది. వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకోవడంతో పాటు డెన్మార్క్‌లోని కోపెన్‌ హాగెన్‌ లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లోనూ అతను కాంస్యం గెలుచుకున్నాడు.

కోపెన్‌ హాగెన్‌ నగరంతో అనుబంధాన్ని ఆ తర్వాత కొనసాగిస్తూ ప్రకాశ్‌ సుదీర్ఘ కాలం అక్కడే ఉండి లీగ్‌లలో పాల్గొన్నాడు (అతని కూతురు,  పాపులర్‌ నటి దీపికా పడుకోణ్‌  అక్కడే పుట్టింది). 1986 సియోల్‌ ఆసియా క్రీడల టీమ్‌ ఈవెంట్‌లో మరో పతకం అతని ఖాతాలో చేరింది. 

ప్రతిభను ప్రోత్సహిస్తూ..
అర్జున, పద్మశ్రీ పురస్కారాలు గెలుచుకున్న ప్రకాశ్‌ 90వ దశకం ఆరంభంలో ఆటకు దూరంగా జరిగినా, కోచ్‌గా కొత్త బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకాశ్‌ పడుకోణ్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దుతోంది. ‘ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌’ ప్రకాశ్‌ ముందుచూపుకి ప్రతిరూపం.

వేర్వేరు క్రీడాంశాల్లో ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, తగిన డైట్‌నివ్వడం, టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించడం.. ఇలా అన్ని రకాలుగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ‘ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌’ తనదైన రీతిలో అండగా ఉంటోంది. బిలియర్డ్స్‌ స్టార్‌ గీత్‌ సేథీతో కలసి ప్రకాశ్‌ నెలకొల్పిన ఈ ఫౌండేషన్‌  ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసింది.

ఆల్‌ ఇంగ్లండ్‌ ఘనత... 
బ్యాడ్మింటన్‌ లో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌. 1899లోనే మొదలైన ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం అంటే అతి పెద్ద ఘనత. ఆ సమయంలో వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌తో పాటు దానికి సమాన హోదా ఉన్న టోర్నమెంట్‌ ఇది. యూరోపియన్‌ సర్క్యూట్‌లో వరుస విజయాలతో ప్రకాశ్‌ మంచి ఊపు మీదున్నాడు. కొన్నాళ్ల క్రితమే పెద్ద టోర్నీలు డానిష్‌ ఓపెన్‌ , స్వీడిష్‌ ఓపెన్‌ లలో అతను టైటిల్‌ కూడా దక్కించుకున్నాడు.

1980 ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ మొదలయ్యాక ఏకపక్ష విజయాలతో ఫైనల్‌ వరకు దూసుకొచ్చాడు. అప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థులు గరిష్ఠంగా 12 పాయింట్లకు మించి సాధించలేకపోయారంటే ప్రకాశ్‌ దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. 15–7, 15–12, 15–0, 15–10, 15–4, 15–4, 15–8, 15–10.. ఇవీ స్కోర్లు! ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన లీమ్‌ స్వీ కింగ్‌ ఎదురయ్యాడు. ఆ సమయంలో అతను అత్యద్భుత ఫామ్‌లో ఉండి చెలరేగిపోతున్నాడు.

‘స్మాష్‌ కింగ్‌’గా గుర్తింపు తెచ్చుకొని అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఇదే టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో ప్రకాశ్‌కు కష్టమే అనిపించింది. అయితే భారత స్టార్‌ ఎక్కడా తొణకలేదు. ప్రత్యర్థి గుర్తింపును పట్టించుకోలేదు. అన్నేళ్లుగా యూరోప్‌లో ఆడిన తన అనుభవాన్ని రంగరించాడు. ఫలితంగా 15–3, 15–10 తేడాతో ఘన విజయం.. ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు. ‘నన్ను ప్రకాశ్‌ హిప్నటైజ్‌ చేసినట్లు అనిపించింది’ అంటూ ఓటమి తర్వాత స్వీకింగ్‌ చేసిన వ్యాఖ్య ఈ గెలుపు ప్రత్యేకతను మరింత పెంచింది. 1980 నుంచి ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్‌ (2001) మినహా మరే భారత షట్లర్‌ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీ గెలుచుకోలేకపోయారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top