Saina Nehwal: హీరో సిద్ధార్థపై సైనా తండ్రి ఆగ్రహం... అసలు అతడు ఏం చేశాడని..

Saina Nehwal Father: My Daughter Won Medals For India What Siddharth Done - Sakshi

బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తండ్రి హర్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌ హీరో సిద్దార్థకు కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచిందని.. అతడు ఏం చేశాడని ప్రశ్నించారు. కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ‘‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం సేఫ్‌గా ఉన్నామని ఎలా చెప్పుకోగలం. ఆటంకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. 

ఇందుకు స్పందించిన సిద్ధార్థ చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్‌ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో టైమ్స్‌ నౌతో మాట్లాడిన సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌... ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అని సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘భారత సమాజం గొప్ప విలువలు కలిగినది. జర్నలిస్టులు, క్రీడా ప్రముఖులు సైనాకు మద్దతుగా నిలిచారు.

తను ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకు తెలుసు కాబట్టే.. తన విలువను గుర్తించారు’’ అని హర్వీర్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ మహిళా కమిషన్‌ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్‌పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్‌ తీరుపై మండిపడుతున్నారు. కాగా పలు ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top