మ్యాక్స్‌వెల్‌ ‘షో’కు హర్షల్‌ తోడుగా...

Royal Challengers Bangalore beat Mumbai Indians by 54 Runs - Sakshi

బెంగళూరు ఘన విజయం

54 పరుగులతో ముంబై చిత్తు

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగిన ఆర్‌సీబీ

కోహ్లి అర్ధ సెంచరీ   

బెంగళూరు మళ్లీ సంబరాల్లో మునిగింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చే గెలుపు దక్కింది. సీజన్‌ తొలి మ్యాచ్‌ తరహాలోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయంతో ఆర్‌సీబీ సత్తా చాటింది. ముందుగా మ్యాక్స్‌వెల్‌ మెరుపు బ్యాటింగ్‌కు తోడు కోహ్లి ఆట జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరును అందిస్తే... ఆపై హర్షల్‌ పటేల్, చహల్‌ చెలరేగి ముంబైని కుప్పకూల్చారు. బౌలింగ్‌లోనూ మ్యాక్స్‌వెల్‌ రెండు వికెట్లతో ఒక చేయి వేయగా... హర్షల్‌ ‘హ్యాట్రిక్‌’ హైలైట్‌గా నిలిచింది. మరోవైపు యూఏఈకి వచ్చిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిన ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

దుబాయ్‌: విరాట్‌ కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 54 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, ఆంధ్ర క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హర్షల్‌ పటేల్‌ (4/17) ‘హ్యాట్రిక్‌’తో చెలరేగగా... చహల్‌ 3, మ్యాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ బెంగళూరు గెలవడం విశేషం.  

మ్యాక్స్‌వెల్‌ సూపర్‌...
బౌల్ట్‌ వేసిన రెండో బంతినే స్క్వేర్‌ లెగ్‌ మీదుగా కోహ్లి మెరుపు వేగంతో సిక్స్‌గా మలచడంతో బెంగళూరు స్కోరు మొదలు కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే పడిక్కల్‌ (0)ను అవుట్‌ చేసి దెబ్బ తీశాడు. అయితే తర్వాతి మూడు భాగస్వామ్యాలు ఆర్‌సీబీకి చెప్పుకోదగ్గ స్కోరును అందించాయి. మూడో స్థానంలో వచి్చన ఆంధ్ర ఆటగాడు భరత్‌ మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా చూడచక్కటి ఫోర్‌ కొట్టిన అతను, రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు.

మరోవైపు కోహ్లి ఇన్నింగ్స్‌ కూడా జోరుగా సాగింది. బుమ్రా ఓవర్లో వరుసగా 4, 6 బాదిన కెప్టెన్‌... మిల్నే వేసిన తర్వాతి ఓవర్లో కూడా ఇలాగే వరుసగా 4, 6 కొట్టాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చహర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ క్యాచ్‌ వదిలేయడం కూడా విరాట్‌కు కలిసొచి్చంది. అయితే అదే ఓవర్లో భరత్‌ను అవుట్‌ చేసి చహర్‌ 68 పరుగుల (43 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత వచి్చన మ్యాక్స్‌వెల్‌ దూకుడుతో ఒక్కసారిగా ఆర్‌సీబీ దూసుకుపోయింది.

ముఖ్యంగా మ్యాక్సీ ‘స్విచ్‌ హిట్‌’లతో ఘనంగా పరుగులు రాబట్టాడు. కృనాల్, చహర్‌ల బౌలింగ్‌లో ఈ షాట్‌తో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన అతను, మిల్నే బౌలింగ్‌లోనూ దాదాపు ఇదే తరహాలో రివర్స్‌ స్వీప్‌తో మరో సిక్స్‌ కొట్టడం విశేషం! 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి ని్రష్కమించగా, బుమ్రా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో డివిలియర్స్‌ (11) తన ఉనికిని ప్రదర్శించాడు. మిల్నే ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన మ్యాక్స్‌వెల్‌ 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే మ్యాక్స్‌వెల్, ఏబీలను వరుస బంతుల్లో బుమ్రా అవుట్‌ చేశాక చివరి 10 బంతుల్లో ఆర్‌సీబీ 4 పరుగులే చేయగలిగింది.  

రోహిత్‌ మినహా...
ఛేదనలో ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్, డి కాక్‌ (23 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. జేమీసన్‌ ఓవర్లో రోహిత్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, క్రిస్టియాన్‌ ఓవర్లో డి కాక్‌ మూడు ఫోర్లు రాబట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అయితే ఒక్కసారిగా బెంగళూరు బౌలర్లు పుంజుకోవడంతో ముంబై బ్యాటింగ్‌ తడబడింది. 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది.

చక్కటి బంతితో డి కాక్‌ను చహల్‌ బోల్తా కొట్టించగా, భారీ షాట్‌కు ప్రయతి్నంచిన రోహిత్‌ బౌండరీ వద్ద క్యాచ్‌ ఇచ్చాడు. ఇషాన్‌ (9), కృనాల్‌ (5) పేలవ షాట్‌లు ఆడి స్వయంకృతంతో అవుట్‌ కాగా, సిరాజ్‌ వేసిన వైడ్‌ బాల్‌ను వెంటాడి సూర్యకుమార్‌ (8) వెనుదిరిగాడు. ఈ దశలో ముంబై కోలుకునే అవకాశమే లేకపోయింది. హార్దిక్‌ (7), పొలార్డ్‌ (3) కూడా చేతులెత్తేయడంతో ముంబై ఓటమి లాంఛనమే అయింది. ఒకదశలో వరుసగా 50 బంతుల పాటు ముంబై ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్‌ కూడా లేకపోవడం పరిస్థితిని సూచిస్తోంది!

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) (సబ్‌) రాయ్‌ (బి) మిల్నే 51; పడిక్కల్‌ (సి) డి కాక్‌ (బి) బుమ్రా 0; భరత్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చహర్‌ 32; మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 56; డివిలియర్స్‌ (సి) డి కాక్‌ (బి) బుమ్రా 11; క్రిస్టియాన్‌ (నాటౌట్‌) 1; షహబాజ్‌ (బి) బౌల్ట్‌ 1; జేమీసన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 165.
వికెట్ల పతనం: 1–7, 2–75, 3–126, 4–161, 5–161, 6–162. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–17–1, బుమ్రా 4–0–36–3, మిల్నే 4–0–48–1, కృనాల్‌ 4–0–27–0, రాహుల్‌ చహర్‌ 4–0–33–1.  
 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) పడిక్కల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 43; డి కాక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చహల్‌ 24; ఇషాన్‌ (సి) హర్షల్‌ (బి) చహల్‌ 9; సూర్యకుమార్‌ (సి) చహల్‌ (బి) సిరాజ్‌ 8; కృనాల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 5; పొలార్డ్‌ (బి) హర్షల్‌ 7; హార్దిక్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 3; మిల్నే (బి) హర్షల్‌ 0; చహర్‌ (ఎల్బీ) (బి) హర్షల్‌ 0; బుమ్రా (బి) చహల్‌ 5; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్‌) 111.
వికెట్ల పతనం: 1–57, 2–79, 3–81, 4–93, 5–97, 6–106, 7–106, 8–106, 9–111, 10–111.
బౌలింగ్‌: జేమీసన్‌ 2–0–22–0, సిరాజ్‌ 3–0–15–1, క్రిస్టియాన్‌ 2–0–21–0, హర్షల్‌ 3.1–0–17–4, చహల్‌ 4–1–11–3, మ్యాక్స్‌వెల్‌ 4–0–23–2.

కోహ్లి @ 10000
విరాట్‌ కోహ్లి టి20 క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని తొలి భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో బ్యాట్స్‌మన్‌గా (గేల్, పొలార్డ్, షోయబ్‌ మాలిక్, వార్నర్‌ తర్వాత) కోహ్లి నిలిచాడు. 314 మ్యాచ్‌లలో కోహ్లి మొత్తం 10,038 పరుగులు చేశాడు. ఇందులో 3159 అంతర్జాతీయ టి20ల్లో సాధించాడు.

హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌  
సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబైపైనే 5 వికెట్లతో చెలరేగిన హర్షల్‌ పటేల్‌ ఈసారి 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో హ్యాట్రిక్‌ కూడా ఉండటం విశేషం. 17వఓవర్‌ తొలి మూడు బంతుల్లో అతను వరుసగా హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్, రాహుల్‌ చహర్‌లను అవుట్‌ చేశాడు.
ఐపీఎల్‌ చరిత్రలో మొత్తం 20 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ నమోదు చేసిన 17వ బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ నిలిచాడు. అమిత్‌ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు, యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు ‘హ్యాట్రిక్‌’ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top