Asia Cup 2022 IND VS PAK: కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ మరో రికార్డు

Rohit Sharma Has Highest Winning Percentage In T20I As Captain, With Minimum 30 Wins - Sakshi

వ్యక్తిగత ప్రదర్శన విషయం అటుంచితే.. కెప్టెన్‌గా మాత్రం రోహిత్‌ శర్మ రెచ్చిపోతున్నాడు. ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలు సాధిస్తూ.. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. తాజాగా పాక్‌పై (ఆసియా కప్‌ 2022) విజయంతో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన కెప్టెన్లలో అత్యధిక విన్నింగ్‌ పర్సంటేజ్‌ (83.33) కలిగిన సారధిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. 

రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచ్‌ల్లో 83.33 విజయాల సగటుతో 30 మ్యాచ్‌లు గెలుపొందింది. రోహిత్‌ సారధ్యంలో భారత్‌ కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్ఘాన్‌ ఉన్నాడు. కెప్టెన్‌గా అఫ్ఘాన్‌ విజయాల శాతం 80.8గా ఉంది. ఆ తరువాత టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (62.5%), ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (59.2%), టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (58.6%), ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (55.6%), న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51.7%) వరుసగా ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో భారత్‌..దాయాదిపై పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.   
చదవండి: 'పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయం'
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top