#Buttler-Samson: ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ అంటే చాలు.. చెలరేగిపోతారు

Rajasthan Royals Breaks Many-Records Vs SRH Match IPL 2023 - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు చేసింది. బట్లర్‌ 95, శాంసన్‌ 66 నాటౌట్‌ విధ్వంసం సృష్టించడంతో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 214 పరుగులు చేసింది.


Photo: IPL Twitter

► ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ అంటే చాలు.. జాస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌లు చెలరేగిపోతారు. ముఖ్యంగా శాంసన్‌లో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.  తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు నాటౌట్‌గా నిలిచిన శాంసన్‌ ఖాతాలో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన చివరి 9 మ్యాచ్‌ల్లో శాంసన్‌ వరుసగా 102*, 48*, 26, 36, 48, 82, 55, 55, 66* పరుగులు చేశాడు. అంటే తొమ్మిది ఇన్నింగ్స్‌ల వ్యవధిలో ఐదు అర్థసెంచరీలు సహా ఒక సెంచరీ మార్క్‌ సాధించిన శాంసన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై స్పష్టమైన ఆధిక్యం చూపాడు.


Photo: IPL Twitter

► ఇక రాజస్తాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ అంటూ చాలు పూనకం వచ్చినట్లుగా ఆడుతున్నాడు. తాజా మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయినప్పటికి 59 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 124, 35, 54, 95 పరుగులు సాధించాడు.

► ఇక బట్లర్‌, సంజూ శాంసన్‌ కలిసి రాజస్తాన్‌ తరపున ఒక మ్యాచ్‌లో రెండో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బట్లర్‌- శాంసన్‌లు రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. ఇంతకముందు కూడా ఈ రికార్డు ఎస్‌ఆర్‌హెచ్‌పైనే ఉంది. 2021లో బట్లర్‌- శాంసన్‌ జోడినే 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డులకెక్కారు. ఇక మూడో స్థానంలో రహానే-స్మిత్‌ జోడి 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 130 పరుగులు జోడించారు. 

► ఇక రాజస్తాన్‌ రాయల్స్‌కు హోంగ్రౌండ్‌ అయిన జైపూర్‌లో ఇప్పటివరకు 202 పరుగులే ఇన్నింగ్స్‌ అత్యధిక స్కోరు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు చేసిన రాజస్తాన్‌ పాత రికార్డును బద్దలుకొట్టింది.

చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌ దాకా అన్నీ ఇక్కడే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top