ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 5) కీలక సమరం జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది. మ్యాచ్‌కు కొన్ని గంటలకు ముందు (సాయంత్రం 4 గంటల ప్రాంతంలో) ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది.
మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్సింది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో వాష్ ఔట్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా.
It's delhi at 3.15 pm not Manali #weather pic.twitter.com/kB9JwzVkeJ
— vipul kashyap (@kashyapvipul) May 5, 2026
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్లే ఆఫ్స్ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఇరు జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సీఎస్‌కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పోలిస్తే సీఎస్‌కే రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించబడుతుంది. అప్పుడు ఇరు జట్లకు అది సంకటంగా మారే ప్రమాదం ఉంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు రంజుగా సాగుతుంది. 13 పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్, గుజరాత్ తలో 12 పాయింట్లతో వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే, ఢిల్లీ తలో 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ సైతం తాజాగా ఓ విజయం సాధించి అధికారికంగా రేసులో కొనసాగుతుంది.
ప్రస్తుతం ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా వదులుకున్న జట్టు ఏదైనా ఉందా అంటే, అది లక్నో మాత్రమే. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. అధికారికంగా రేసులో ఉన్నప్పటికీ.. అది జరిగే పని కాదు.


