
ఆసియా కప్-2025 (Asia Cup)టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం (Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఏనాటికైనా పరిస్థితులు చక్కబడి దాయాదులు టెస్టు సిరీస్‌లో పోటీపడితే చూడాలని ఉందని తెలిపాడు.
ఎనిమిది జట్లు
ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా.. పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ఖండాంతర టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఒమన్, హాంకాంగ్, యూఏఈ పాల్గొంటున్నాయి.
అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న తొలిసారి తలపడనున్నాయి. అన్నీ సజావుగా సాగితే మరో రెండుసార్లు దాయాదులు పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడల్లో ఏ స్థాయిలోనూ పాకిస్తాన్‌తో ఆడొద్దనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ.. ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే పరిస్థితి కనబడటం లేదు. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.
ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే, పాకిస్తాన్‌లో మేము మాత్రం సైలైంట్‌గానే ఉన్నాము.
ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చు
ఒకవేళ వాళ్లు మాతో మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా ఓకే. ఆఖరి నిమిషంలో వారు మనసు మార్చుకున్నా ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. అయితే, నా జీవితకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు.
అదే విధంగా.. ‘‘రాజకీయాలు వేరు. వాటి గురించి నాకు తెలియదు. వాళ్లు వారి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మేము కూడా. అయితే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరైనా సరే తమ దేశం సాధించిన విజయాల గురించి తలచుకోవడానికే ఇష్టపడతారు. అక్కడితో ఆగిపోతే అంతా బాగుంటుంది’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.
కాగా భారత్- పాకిస్తాన్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ముఖాముఖి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుస విజయాలతో చాంపియన్‌గా నిలిచింది.
చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’