KKR VS RCB: ఏప్రిల్‌ 6.. ఏడాది గ్యాప్‌.. కేకేఆర్‌ బ్యాటర్ల మహోగ్రరూపం

Pat Cummins, Shardul Thakur Blasts For KKR In 2022, 2023 IPL Seasons - Sakshi

ఐపీఎల్‌ 2023లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం​ ఇదే రోజున (ఏప్రిల్‌ 6, 2022) కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్‌పై కమిన్స్‌ 14 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్‌ కూడా కమిన్స్‌ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్‌లో కేకేఆర్‌ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్‌ అభిమానులు మాత్రం ఏ​ప్రిల్‌ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో శార్దుల్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ, కరణ్‌ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్‌ చక్రవర్తి (4/15), సునీల్‌ నరైన్‌ (2/16), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సుయశ్‌ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top