Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్‌ అలా బతికిపోయింది!

Pak Vs NZ 1st Test Day 5: Match Drawn After Pakistan Declared for 318 - Sakshi

Pak Vs NZ 1st Test Day 5- కరాచీ: చివరి సెషన్‌లో వెలుతురు మందగించడంతో ఉత్కంఠభరిత ముగింపు లభిస్తుందనుకున్న పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు ‘డ్రా’ అయింది. పాక్‌ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. 7.3 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది.

పాక్‌ అలా బతికిపోయింది!
ఓపెనర్‌ బ్రాస్‌వెల్‌ 3 పరుగులకే పెవిలియన్‌ చేరినా.. డెవాన్‌ కాన్వే (16 బంతుల్లో 18 పరుగులు) పర్వాలేదనిపించాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన టామ్‌ లాథమ్‌(24 బంతుల్లో 35 పరుగులు) జోరు ప్రదర్శించాడు.

ఈ దశలో వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపి వేశారు. దాంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 8 వికెట్లకు 311 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నిజానికి కాన్వే, లాథమ్‌ విజృంభిస్తే గనుక.. పాక్‌ విసిరిన లక్ష్యాన్ని కివీస్‌ ఛేదించేదే! అయితే వెలుతురులేమి కారణంగా పాక్‌ అలా బతికిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరిసిన పర్యాటక కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ
మ్యాచ్‌ డ్రా అయిన నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. ‘‘ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం సాహసోపేత నిర్ణయమే. నిజానికి మేము ఫలితం రాబట్టాలని ఆశించాం. కానీ వెలుతురు సరిగ్గా లేదు. మా ఐదో బౌలర్‌ సల్మాన్‌కు రెండు రోజులుగా ఆరోగ్యం బాగా లేదు. అయినప్పటికీ మా బౌలింగ్‌ విభాగంలో ఉన్న సౌద్‌, వసీం జూనియర్‌ రాణించారు. సానుకూల దృక్పథంతో ఆడారు’’ అని పేర్కొన్నాడు.

పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు స్కోర్లు:
పాక్‌- 438 & 311/8 డిక్లేర్డ్‌
న్యూజిలాండ్‌- 612/9 డిక్లేర్డ్‌ & 61/1

చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top