
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఒమన్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్‌కు పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ జతీందర్ సింగ్ (Jatinder Singh) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కొత్తగా నలుగురు.. కెప్టెన్ మనోడే
ఇక ఆసియా కప్ ఆడబోయే ఒమన్ జట్టులో జితేందర్ (పంజాబ్‌లోని లుథియానాలో జన్మించాడు)తో పాటు వినాయక్ శుక్లా, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిస్త్ తదితర భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు.. సూఫియాన్ యూసఫ్, జిక్రియా ఇస్లాం, ఫైజల్ షా, నదీం ఖాన్ కొత్తగా ఈ టీ20 జట్టులోకి వచ్చారు.
ఇదే తొలిసారి
ఇదిలా ఉంటే.. ఒమన్ ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఒమన్ హెడ్‌కోచ్ దులీప్ మెండిస్ మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలో ఆడటం మా జట్టుకు లభించిన గొప్ప అవకాశం.గ్లోబల్ వేదిక మీద మా నైపుణ్యాలు ప్రదర్శించే ఛాన్స్ దక్కినందుకు సంతోషంగా ఉంది.
భారత్, పాకిస్తాన్ వంటి జట్లతో ఆడటం అద్భుతమైన అవకాశం. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్క మ్యాచ్ కూడా మా రాతను మార్చేయవచ్చు.
మా జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువకులు కూడా ఉన్నారు. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా మా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక దృఢత్వం కూడా మరింతగా పెరుగుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
ఎనిమిది జట్లు
కాగా ఆసియా కప్-2025 ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడతాయి. ఇక ఈ టోర్నీలో సెప్టెంబరు 12న ఒమన్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. సెప్టెంబరు 15న యూఏఈతో మ్యాచ్ ఆడనుండగా.. సెప్టెంబరు 19న టీమిండియాను ఢీకొడుతుంది.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నీకి ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తమ జట్లను ప్రకటించగా... తాజాగా ఒమన్ కూడా ఈ జాబితాలో చేరింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఒమన్ జట్టు
జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.
చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్