కేకేఆర్‌ బౌలర్‌కి ధోనీ సూచనలు

IPL2020 Varun Chakravarthy takes tips from MS Dhoni - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి దాదాపు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) పోతూపోతూ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు షాకిచ్చింది. కేకేఆర్‌ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్లు వీరోచిత ఇన్సింగ్స్‌తో కోల్‌కత్తా ఆశలపై నీళ్లు చల్లారు. 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. అయితే  సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. 33 బంతుల్లో 52 పరుగుల చేయాలన్న దశలో క్రిజ్‌లోకి అడుగుపెట్టిన ధోనీ.. తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒకేఒక్క పరుగుకే పరిమితమై.. కేకేఆర్‌ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాగా వరుణ్‌ బౌలింగ్‌లో ధోనీ క్లీన్‌ బౌల్డ్‌ కావడం వరుసగా ఇది రెండోసారి. (కోల్‌కతాకు చెన్నై దెబ్బ)


ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్‌ తొలి మ్యాచ్‌లోనూ ధోనీ ఇదే విధంగా అవుట్‌ అయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతని డెలివరీకి కంగుతిన్న సారథి.. వెనక్కి తిరిగి చూడకుండానే పెవీలియన్‌ బాటపట్టాడు. అయిత్‌ మ్యాచ్‌ అనంతరం తన అభిమాన ఆటగాడు ధోనీ వద్దకు వెళ్లిన వరుణ్‌ చక్రవర్తి కాసేపు ముచ్చటించాడు. ప్రత్యర్థి ఆటగాడు అయినప్పటికీ ధోనీ అతనికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఆటలోని మెళకువలను వివరించాడు. అనంతరం తన జెర్సీపై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకుని మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోని కేకేఆర్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గత మ్యాచ్‌లో ధోనీని అవుట్‌ చేయడమే కాకుండా వరుణ్‌ కట్టుదిట్టమైన బౌలింత్‌తో సీఎస్‌కే ఒత్తిడిలో నెట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పటడొట్టాడు.
 
కాగా తమిళనాడుకు చెందిన వరుణ్‌ చక్రవర్తి కేకేఆర్‌ జట్టులో కీలక ఆటగాడికి గుర్తింపు పొందాడు. విజయ్‌ హాజరే ట్రోపీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆటగాడిని 2019 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ జట్టు అనుహ్యంగా 8 కోట్లుకు కొనుగోలు చేయడంతో క్రీడా అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ సీజన్‌లో అంతగా రాణించకపోవడంతో పంజాబ్‌ వదులుకుంది. అనంతరం తాజా సీజన్‌లో కోల్‌కత్తా జట్టును వరుణ్‌ను సొంతం చేసుకుంది. చక్కటి ప్రదర్శనతో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ తమిళనాడు ఆటగాడిని బీసీసీఐ సైతం త్వరగానే గుర్తించింది. ఐపీఎల్‌ అనంతరం ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ-20ల సీరిస్‌కు ఎంపిక చేసింది. సెలక్టర్ల పిలుపుతో వరుణ్‌ ఆనందానికి అవధులులేకుండా పోతోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top