#Abhishek Sharma: అభిషేక్‌ శర్మ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఘాటు విమర్శలు

IPL 2023: It Is Not Abhishek Mistake: Aakash Chopra On SRH Loss To LSG - Sakshi

IPL 2023- SRH Vs LSG: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమికి అభిషేక్‌ శర్మను బాధ్యుడిని చేయడం సరికాదని టీమిండియా మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. తప్పంతా కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌దేనంటూ ఘాటు విమర్శలు చేశాడు. చెత్త నిర్ణయాలే రైజర్స్‌ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో శనివారం తలపడింది సన్‌రైజర్స్‌.

ఆరంభంలో పర్లేదు
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రైజర్స్‌.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆదిలోనే హిట్టర్‌ కైలీ మేయర్స్‌(2) వికెట్‌ కోల్పోయింది.

మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(29) తక్కువ స్కోరుకే పరిమితం కావడం రైజర్స్‌కు కలిసివచ్చింది. అయితే, 16వ ఓవర్లో కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ బంతిని అభిషేక్‌ శర్మకు ఇవ్వడం.. అతడి ఓవర్లో స్టొయినిస్‌, పూరన్‌ కలిసి ఏకంగా ఐదు సిక్సర్లు బాదడం తీవ్ర ప్రభావం చూపింది.

ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ను తిప్పేసింది!
ఒక్క ఓవర్లోనే ఈ మేరకు 31 పరుగులు రాబట్టిన లక్నో.. నికోలస్‌ పూరన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 15 ఓవర్ల దాకా మ్యాచ్‌ తమ చేతిలోనే ఉందని మురిసిపోయిన సన్‌రైజర్స్‌ భారీ ఓటమి కారణంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. 

అభిషేక్‌ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు?
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా వస్తున్న అభిషేక్‌ శర్మపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆకాశ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జియో సినిమా షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘అసలు అభిషేక్‌ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు?

మయాంక్‌ మార్కండే అందుబాటులో ఉన్నా కూడా అభిషేక్‌ శర్మతో ఆ ఓవర్‌ వేయించడంలో మర్మమేమిటో నాకైతే అర్థం కాలేదు. అభిషేక్‌ తొలి రెండు బంతులను ప్రత్యర్థి బ్యాటర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అవుటయ్యాడు.

వారిని నిందించడం సరికాదు
అయితే.. నికోలస్‌ పూరన్‌ రాగానే మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఆటలో ఇవన్నీ సహజమే. నిజానికి ఇందులో అభిషేక్‌ తప్పు లేదు. ఒక బౌలర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్‌కు, మేనేజ్‌మెంట్‌కు తెలిసి ఉండాలి. అంతేగానీ.. ఇలాంటి వాటికి సదరు బౌలర్‌నో.. ప్లేయర్‌నో బాధ్యులను చేయడం, వారిని నిందించడం సరికాదు’’ అని పేర్కొన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌, లక్నో క్రికెటర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ అర్ధ శతకం సాధించడం అత్యంత సానుకూల అంశమని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చాడు లక్నో బ్యాటర్‌ ప్రేరక్‌. 45 బంతుల్లో 64 పరుగులు రాబట్టి.. పూరన్‌(13 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.  ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అభిషేక్‌ శర్మ 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top