బట్లర్‌ ‘రాయల్‌’ సెంచరీ

IPL 2022: Rajasthan Royals beat Mumbai Indians by 23 runs - Sakshi

రాజస్తాన్‌కు మరో విజయం

23 పరుగులతో ముంబై ఓటమి

తిలక్‌ వర్మ మెరుపులు వృథా

ముంబై: ఐపీఎల్‌ తొలి పోరులో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి విజయాన్ని అందుకుంది. డీవై పాటిల్‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. రోహిత్‌ సేనకు టోర్నీలో ఇది వరుసగా రెండో పరాజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (68 బంతుల్లో 100; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హెట్‌మైర్‌ (14 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండగా నిలిచారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్‌ క్రికెటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ (33 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేశారు.

బట్లర్‌ జోరు...
రాయల్స్‌ ఆరంభంలోనే యశస్వి (1) వికెట్‌ కోల్పోగా, పడిక్కల్‌ (7) కూడా విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్‌ బట్లర్‌ దూకుడుతో భారీ స్కోరు సాధ్యమైంది. బాసిల్‌ థంపి వేసిన ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని బట్లర్‌ తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 6, 6, 4, 6 బాదడం విశేషం. బట్లర్‌ వరుసగా సామ్సన్, హెట్‌మైర్‌లతో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. చివర్లో పొలార్డ్‌ ఓవర్లో హెట్‌మైర్‌ వరుసగా 6, 6, 4, 4 కొట్టడం హైలైట్‌గా నిలిచింది. 66 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. చివరి 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్‌ స్కోరు 200 పరుగుల లోపే ఆగిపోయింది.  

ఆకట్టుకున్న తిలక్‌...
ఛేదనలో ముంబై తక్కువ వ్యవధిలో రోహిత్‌ శర్మ (10), అన్‌మోల్‌ప్రీత్‌ (5) వికెట్లు చేజార్చుకుంది. అయితే కిషన్, తిలక్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. కెరీర్‌లో రెండో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న తిలక్‌ వర్మ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చహల్‌ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి అతను కొట్టిన సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. మూడో వికెట్‌కు 54 బంతుల్లో 81 పరుగులు జోడించిన అనంతరం కిషన్‌ వెనుదిరగ్గా... 28 బంతుల్లో తిలక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌తో భారీ సిక్స్‌ కొట్టిన తిలక్‌ తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డయ్యాడు. సుదీర్ఘ అనుభవజ్ఞుడైన అశ్విన్‌...కొత్త కుర్రాడిని అవుట్‌ చేసి చూపించిన భావోద్వేగాలు తిలక్‌ ఇన్నింగ్స్‌ విలువేమిటో చూపించాయి! గెలుపు కోసం 42 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్‌ (24 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (బి) బుమ్రా 100; యశస్వి (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 1; పడిక్కల్‌ (సి) రోహిత్‌ (బి) మిల్స్‌ 7; సామ్సన్‌ (సి) తిలక్‌ (బి) పొలార్డ్‌ 30; హెట్‌మైర్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 35; పరాగ్‌ (సి) డేవిడ్‌ (బి) మిల్స్‌ 5; అశ్విన్‌ (రనౌట్‌) 1; సైనీ (సి) కిషన్‌ (బి) మిల్స్‌ 2; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 193.  వికెట్ల పతనం: 1–13, 2–48, 3–130, 4–183, 5–184, 6–185, 7–188, 8–193.
బౌలింగ్‌: బుమ్రా 4–0–17–3, స్యామ్స్‌ 4–0–32–0, థంపి 1–0–26–0, మురుగన్‌ అశ్విన్‌ 3–0–32–0, మిల్స్‌ 4–0–35–3, పొలార్డ్‌ 4–0–46–1.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) సైనీ (బి) బౌల్ట్‌ 54; రోహిత్‌ (సి) పరాగ్‌ (బి) ప్రసిధ్‌ 10; అన్‌మోల్‌ప్రీత్‌ (సి) పడిక్కల్‌ (బి) సైనీ 5; తిలక్‌ వర్మ (బి) అశ్విన్‌ 61; పొలార్డ్‌ (సి) బట్లర్‌ (బి) సైనీ 22; టిమ్‌ డేవిడ్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 1; స్యామ్స్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 0; మురుగన్‌ అశ్విన్‌ (రనౌట్‌) 6; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 170.
వికెట్ల పతనం: 1–15, 2–40, 3–121, 4–135, 5–136, 6–136, 7–165, 8–170.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–29–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0– 37–1, సైనీ 3–0–36–2, అశ్విన్‌ 4–0–30–1, చహల్‌ 4–0–26–2, పరాగ్‌ 1–0–11–0.

ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ X పంజాబ్‌ కింగ్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top