IND Vs SA: ఏడుసార్లు పర్యటిస్తే 9 మందికి మాత్రమే సాధ్యమైంది!

Intresting Facts Nine Indians Who Hit Test Century In South Africa Tour - Sakshi

Only Nine Indian Batsmen Hit Century In South Africa Tour.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంతవరకు టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. ప్రతీసారి ఎన్నో ఆశలతో ప్రొటీస్‌ గడ్డపై అడుగుపెట్టే టీమిండియా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక 2018లో చివరిసారి సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్‌ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 1991 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య 39 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో టీమిండియా 14 విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా 15 విజయాలు అందుకుంది. ఇక ఇప్పటివరకు భారత్‌ సౌతాఫ్రికాలో ఏడుసార్లు పర్యటించగా.. ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదు. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు నమోదు చేసింది.

ఇక సౌతాఫ్రికా పిచ్‌లంటే బౌలర్లకు స్వర్గధామం అని చెప్పొచ్చు.  కుకాబుర్రా బంతులతో స్వింగ్‌, సీమ్‌, పేస్‌, బౌన్స్‌లను రాబట్టే బౌలర్లు బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. అలాంటి సౌతాఫ్రికా గడ్డపై మన టీమిండియా బ్యాట్స్‌మెన్లలో కేవలం 9 మంది మాత్రమే టెస్టుల్లో శతకాలు సాధించారు.  

సచిన్‌ టెండూల్కర్‌:
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు సౌతాఫ్రికా గడ్డపై మంచి రికార్డే ఉంది. బ్యాట్స్‌మన్‌లు సౌతాఫ్రికా పిచ్‌లపై ఒక్క సెంచరీ సాధించడానికే నానా కష్టాలు పడితే.. సచిన్‌ మాత్రం ఐదు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండుసార్లు 150 మార్క్‌ను అందుకోగా.. 146, 111, 111 నాటౌట్‌ ఉన్నాయి.  ఇక 1997లో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన టెస్టులో సచిన్‌ 169 పరుగులు చేయడం విశేషం.

విరాట్‌ కోహ్లి:
ఇక సచిన్‌ తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లి ఉన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై కోహ్లి ఇప్పటివరకు టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించారు. ఒకసారి 153 పరుగులు.. మరొకసారి 119 పరుగులు చేశాడు.

మహ్మద్‌ అజారుద్దీన్‌:


1997లో సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో పడింది. ఈ దశలో సచిన్‌తో కలిసి అజారుద్దీన్‌ ఆరో వికెట్‌కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అజహర్‌ 115 పరుగులతో మెరవగా.. సచిన్‌ టెండూల్కర్‌ 169 పరుగులతో సౌతాఫ్రికా గడ్డపై బెస్ట్‌ స్కోర్‌ సాధించాడు.

రాహుల్‌ ద్రవిడ్‌:


టీమిండియా వాల్‌గా పేరు పొందిన  రాహుల్‌ ద్రవిడ్‌కు ప్రొటీస్‌ గడ్డపై ఒక సెంచరీ ఉంది. 1997లో జోహన్నెస్‌బర్గ్‌ టెస్టులో ఈ మిస్టర్‌ డిపెండబుల్‌ 148 పరుగులతో శతకం సాధించాడు. ఇక ద్రవిడ్‌ ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కపిల్‌ దేవ్‌:


టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ 1992లో పోర్ట్‌ ఎలిజిబెత్‌ వేదికగా జరిగిన టెస్టులో 129 పరుగులు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌:


టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సౌతాఫ్రికా గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో  సెంచరీ సాధించాడు.

చతేశ్వర్‌ పుజారా:


టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా సౌతాఫ్రికా గడ్డపై ఒక సెంచరీ నమోదు చేశాడు. 2013లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన టెస్టులో 153 పరుగులు చేశాడు.

వసీమ్‌ జాఫర్‌:


ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న వసీం జాఫర్‌ 2007 సౌతాఫ్రికా పర్యటనలో ఒక శతకంతో మెరిశాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 116 పరుగులు సాధించాడు.

ప్రవీణ్‌ ఆమ్రే:
1992 సౌతాఫ్రికా పర్యటనలో డర్బన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ప్రవీణ్‌ ఆమ్రే (103) సెంచరీతో మెరిశాడు.

► మరి మూడేళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈసారి ఏ ఆటగాడు శతకాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక డిసెంబర్‌ 26 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top