అన్ని జట్లకు అంత అదృష్టం ఉండదు కదా మైకేల్‌!

India vs England T20I Wasim Jaffer Counter To Michael Vaughan Tweet - Sakshi

మైకేల్‌ వాన్‌కు వసీం కౌంటర్‌

న్యూఢిల్లీ: టీమిండియా- ఇంగ్లండ్‌ తొలి టీ20 ఫలితంపై వ్యంగ్యంగా స్పందించిన ఇంగ్లిష్‌ జట్టు మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌కు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. అన్ని క్రికెట్‌ జట్లలోనూ నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండరు కదా అంటూ చమత్కరించాడు. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మొదటి టీ20లో ఇంగ్లండ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘భారత జాతీయ టీ20 జట్టు కంటే, ఐపీఎల్‌ టీం ముంబై ఇండియన్స్‌ జట్టు నయం అనిపిస్తోంది’’ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఇందుకు బదులుగా.. ‘‘నలుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడించే అదృష్టం అన్ని జట్లకు ఉండదు కదా మైఖేల్‌’’ అంటూ వసీం చమత్కరించాడు.

ఈ క్రమంలో.. విదేశాల్లో జన్మించి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ల ప్రతిభను, ఇంగ్లండ్‌ జట్టు విజయంలో వారి పాత్రను ఉద్దేశించి వసీం ఈ మేరకు ట్వీట్‌ చేశాడంటూ కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఐపీఎల్‌ నిబంధన ప్రకారం ఓ తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే వీలుంటుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వసీం ఇలా సెటైరికల్‌ కామెంట్‌ చేశాడని పేర్కొంటున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ ఆరంభమైన నాటి నుంచి ఏదో ఒక విధంగా మైకేల్‌ వాన్‌ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడో టెస్టులో భారత్‌ విజయం సాధించడం పట్ల మొటేరా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల కురిపించి టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఇప్పుడు అదే మైదానంలో తమ జట్టు విజయం సాధించడంతో అతడు ఈ మేరకు ఆతిథ్య జట్టును ఎద్దేవా చేయడం గమనార్హం. ఇక ఇంగ్లండ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: తొలి టి20లో భారత్‌ ఓటమి
త్రో వేయడంలో కన్ఫ్యూజన్‌‌.. అసలు మజా అక్కడే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top