నిరాశ పరిచిన రహానే.. మంజ్రేకర్‌ కామెంట్లు!

India VS England Sanjay Manjrekar Comments On Rahane - Sakshi

చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత విజయంతో కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు అజింక్య రహానే. పింక్‌బాల్‌ టెస్టులో ఘోర పరాజయం ఎదురైన వేళ ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుకు నడిపించి, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ మరోసారి కైవసంలో తన వంతు పాత్ర పోషించాడు. గాయాలతో వరుసగా సీనియర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమైనా, గెలుపు అసాధ్యం అనుకున్న చోట యువ ఆటగాళ్లతోనే సిరీస్‌ నెగ్గి సత్తా చాటాడు. దీంతో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన రహానేపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా కూడా రహానే మెరుగైన స్కోరే చేశాడు. మెల్‌బోర్న్‌ గెలుపులో 112, 27 పరుగులతో రాణించిన రహానే..  చివరిదైన గబ్బా టెస్టులోనూ 24, 37 చెప్పుకోదగ్గ స్కోరుతో ఆకట్టుకున్నాడు. 

దీంతో.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో రహానే ప్రదర్శనపై అంతా దృష్టి సారించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టగా.. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానే బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకుంటాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆ అంచనాలను అతడు అందుకోలేకపోయాడు. చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేసిన రహానే, డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో రూట్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు బలైపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్‌ అద్భుత బంతికి డకౌట్‌ అయ్యాడు. కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ రహానే మరోసారి తేలిపోవడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బ్యాట్స్‌మెన్‌గా రహానే ప్రదర్శనపై పెదవి విరిచాడు. ‘‘కెప్టెన్‌గా రహానే ఒకే. మరి బ్యాట్స్‌మెన్‌గా. మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీ తర్వాత, 27(నాటౌట్‌), 22, 4,37, 24, 1, 0. అద్భుతమైన 100 తర్వాత క్లాస్‌ ప్లేయర్లు ఫామ్‌ కొనసాగిస్తారు. కొన్నిసార్లు ఫామ్‌ కోల్పోయి జట్టుకు భారంగా మారతారు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. దీంతో.. ‘‘రహానే నిలకడగా ఆడిన సందర్భాలు లేవు. కెప్టెన్‌గా తనకు వంక పెట్టడానికి లేదు. కానీ బ్యాట్స్‌మెన్‌గా ఇలా ఆడటం సరికాదు. ముంబై నుంచి వచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో జట్టులో ఉన్నాడా?’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం .. ఏంటిది రహానే ఇలా చేశావు. అయినా ఒక్క మ్యాచ్‌తోనే అతడిపై విమర్శలు తగవు. తనదైన రోజు కచ్చితంగా బ్యాట్‌తో సమాధానం ఇస్తాడు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top