‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే

India and New Zealand to be adjudged joint winners in case of draw or tie - Sakshi

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై ఐసీసీ ప్రకటన

ఫలితం రావడానికి ఆరో రోజుకు పొడిగించబోమని స్పష్టీకరణ

దుబాయ్‌: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 18 సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్‌మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే...

మ్యాచ్‌ తేదీలు:  జూన్‌ 18 నుంచి 22 వరకు  

వేదిక: సౌతాంప్టన్‌లోని ఏజియస్‌ బౌల్‌ మైదానం

ఉపయోగించే బంతి: భారత్‌లో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లను ఎస్‌జీ బంతులతో, న్యూజిలాండ్‌లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్‌ కోసం డ్యూక్స్‌ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వాడే డ్యూక్స్‌ బంతులు సీమ్‌ ఎక్కువగా ఉండి బౌలింగ్‌కు అనుకూలిస్తాయి.  

మ్యాచ్‌ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్‌ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్‌కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది.   

రిజర్వ్‌ డే ఉందా: ఉంది, జూన్‌ 23ను రిజర్వ్‌ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది.  

ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్‌ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్‌ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్‌ డేలో సమయాన్ని వాడుకుంటారు.  

రిజర్వ్‌ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్‌ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు.  

ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ సిరీస్‌లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్‌ రన్‌లను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తారు. అంపైర్‌ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే ముందు బ్యాట్స్‌మన్‌ షాట్‌కు ప్రయత్నించాడా అనే అంపైర్‌ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్‌ జోన్‌’ ఎత్తును కూడా పెంచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top