Sehwag: ఈ కుర్రాడిని ఫ్రీగా వదిలేయండి.. పంత్‌పై సెహ్వాగ్‌ ఆసక్తికర ట్వీట్‌

IND Vs SA 3rd Test: One Of The Biggest Match Winners In Test Cricket, Sehwag Lauds Rishabh Pant - Sakshi

Sehwag Lauds Rishabh Pant: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో వీరోచిత శతకంతో చెలరేగిన టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. గవాస్కర్‌, సచిన్‌ వంటి దిగ్గజాలు పంత్‌ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తుతున్నారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం పంత్‌ను కొనియాడాడు. ఎక్కడ రాణించామా అన్నది కాదు.. కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడామా అన్నదే ముఖ్యమని పంత్‌ అభిమానులు సోషల్‌మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం పంత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ కుర్రాడిని వదిలేయండి. ప్రపంచ క్రికెట్‌లో బిగ్గెస్ట్‌ మ్యాచ్‌ విన్నర్లలో ఒకడు అంటూ కితాబునిచ్చాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించాడు. కాగా, పంత్‌(139 బంతుల్లో 100 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకం సాయంతో దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా పంత్‌.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(10), కోహ్లి(29), పంత్‌ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే.    
చదవండి: పంత్‌ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top