Mohammed Siraj Injury: సిరాజ్‌ గాయంపై అప్‌డేట్‌ ఇచ్చిన అశ్విన్‌.. ఒకవేళ జట్టుకు దూరమైతే

Ind vs Sa 2nd Test: Ravi Ashwin Update on Mohammed Siraj Injury - Sakshi

Mohammed Siraj Injury: మహ్మద్‌ సిరాజ్‌ పట్టుదల గల వ్యక్తి అని, తప్పక తిరిగి మైదానంలో అడుగుపెడతాడని టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సిరాజ్‌ కోలుకుని ఆటను కొనసాగించగలడని పేర్కొన్నాడు. కాగా వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా సిరాజ్‌ మోకాలి కండరాల నొప్పితో విలవిల్లాడిన సంగతి తెలిసిందే. 17వ ఓవర్‌ ఐదో బంతి వేసిన సిరాజ్‌... అసౌకర్యానికి గురయ్యాడు. ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. 

అయితే, నొప్పి తీవ్రం కావడంతో సిరాజ్‌ మైదానాన్ని వీడగా... శార్దూల్‌ ఠాకూర్‌ ఓవర్‌ పూర్తి చేశాడు. ఈ విషయం గురించి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అడిగిన ప్రశ్నకు అశ్విన్‌ బదులిస్తూ.. ‘‘సిరాజ్‌ గాయం గురించి మాట్లాడవచ్చా అని నేను మా మీడియా మేనేజర్‌ ఆనంద్‌ను అడిగాను. ఆయన సరేనన్నారు. వైద్య సిబ్బంది అతడిని పర్యవేక్షిస్తోంది. 

సిరాజ్‌ పట్టుదల, సంకల్పం గొప్పది. అతడు తప్పక తిరిగి రావడమే కాదు.. తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తాడు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. కాగా పేసర్లకు దక్షిణాఫ్రికా పిచ్‌లు అనుకూలిస్తాయన్న నేపథ్యంలో బుమ్రా సారథ్యంలో పేస్‌ దళంతో బరిలోకి దిగిన భారత్‌ తొలి టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో బుమ్రా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌లతో పటిష్టంగా కనిపించిన భారత జట్టుకు.. ఒకవేళ సిరాజ్‌ గనుక దూరమైతే ఎదురుదెబ్బే. 

►రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202-10
తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది.  

చదవండి: SA vs IND: భారీ సిక్స్‌ కొట్టిన బుమ్రా.. వీడియో వైరల్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top