దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఒక్కో ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్ నోమన్ అలీ మూడు స్థానాలు పడిపోయి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో షంటో తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బంగ్లాదేశ్‌కే చెందిన మోమినుల్ హక్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 35వ ర్యాంక్‌లో ఉన్నాడు.


