IPL 2026: ‘గెల‌వ‌డానికే బరిలోకి దిగుతున్నాం’ | Head Coach Ashish Nehra On Gujarat Titans Approach In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘గెల‌వ‌డానికే బరిలోకి దిగుతున్నాం’

Mar 24 2026 2:01 PM | Updated on Mar 24 2026 2:09 PM

Head Coach Ashish Nehra On Gujarat Titans Approach In IPL 2026

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో గుజ‌రాత్ టైటాన్స్ ప్ర‌స్థానం 2022లో మొద‌లైంది. ఆ సీజ‌న్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ బ‌రిలోకి దిగిన తొలిసారే చాంపియ‌న్‌గా నిలవ‌డం విశేషం. ఆ మ‌రుస‌టి ఏడాది అంచ‌నాల‌ను అందుకుంటూ మ‌రోసారి ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ర‌న్న‌ర‌ప్‌కే ప‌రిమితమ‌యింది. 

అయితే 2024 సీజ‌న్‌లో పేల‌వ ఆట‌తీరుతో లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైన గుజ‌రాత్ గ‌త సీజ‌న్‌లో మాత్రం మ‌రోసారి మంచి ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసింది. గిల్ కెప్టెన్సీలో గుజ‌రాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఐదో సీజ‌న్ ఆడ‌నున్న గుజ‌రాత్ టైటాన్స్ ఈసారి క‌ప్పు గెల‌వ‌డానికే బ‌రిలోకి దిగుతోంద‌ని ఆ జ‌ట్టు ప్ర‌ధాన‌ కోచ్ ఆశిష్ నెహ్రా ధీమా వ్య‌క్తం చేశాడు. 

సోమ‌వారం రాత్రి గుజ‌రాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ  పూర్తిస్థాయి జ‌ట్టుతో శుభారంభ్-2026 కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు, ఫ్రాంచైజీ ఓన‌ర్లు, స‌హాయ‌క సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో నెహ్రా మాట్లాడాడు. ‘ఈ సీజ‌న్‌లో భిన్నంగా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నేను అనుకోవ‌డం లేదు. ఎందుకంటే నేను ఆలోచించ‌డానికేం లేదు. 

ఎందుకంటే బ‌రిలోకి దిగ‌నున్న జ‌ట్టు మ్యాచ్ ఎలా ఆడాల‌న్న‌ది ఆలోచిస్తోంది, జ‌ట్టు ఆట‌గాళ్లు దీని గురించి ఆలోచిస్తారు. ఒక కోచ్‌గా నేను స‌ల‌హాలు మాత్ర‌మే అందివ్వ‌గ‌ల‌ను. ఈ శుభారంబ్ వేడుక సాక్షిగా ఒక విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నా. ఈ సీజ‌న్‌కు పూర్తి ఆత్మ‌విశ్వాసంతో వ‌స్తున్నాం. ఈసారి కేవ‌లం పాల్గొన‌డానికి రాలేదు, ఐపీఎల్‌లో క‌ప్పు గెల‌వ‌డానికే  వ‌స్తున్నాం. 

కొత్త జ‌ట్టుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంతా అంటున్నారు. కానీ మా విధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎప్పుడు రెండు అడుగులు ముందే ఉంటాయి. ఐదేళ్లుగా గుజ‌రాత్ జ‌ట్టుతోనే ఉన్నాను.  ఈ ఐదేళ్ల‌లో జ‌ట్టుతో ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయి.  ఈ శుభారంభ్ మా గుజ‌రాత్ టైటాన్స్‌కు కొత్త శోభ‌ను తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన స్ఫూర్తి, ఐక్య‌త‌తో ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక గుజ‌రాత్ టైటాన్స్ ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్‌ను మార్చి 31 ముల్ల‌న్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది.

Advertisement
 
Advertisement
Advertisement