రాష్ట్ర మంత్రిగా కేకేఆర్‌ మాజీ ఆటగాడు | Ex-KKR Star Ashok Dinda Appointed As West Bengal's New Sports Minister | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మంత్రిగా కేకేఆర్‌ మాజీ ఆటగాడు

May 9 2026 9:11 AM | Updated on May 9 2026 9:20 AM

Ex-KKR Star Ashok Dinda Appointed As West Bengal's New Sports Minister

టీమిండియా మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ బౌలర్‌ అశోక్‌ దిండా పశ్చిమ బెంగాల్‌ నూతన క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో విజయఢంకా మోగించిన బీజేపీ, దిండాకు తమ మంత్రివర్గంలో స్థానం కల్పించింది. 

దిండా మోయ్నా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. టీఎంసీ అభ్యర్ది చందన్‌ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో విజయం సాధించి మంత్రి అయ్యాడు.

42 ఏళ్ల దిండా 2021లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి బీజేపీలో చేరాడు. దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్‌ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 420 వికెట్లు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 151 వికెట్లు పడగొట్టాడు. దిండా బెంగాల్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్‌ అయిన దిండా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ, ఢిల్లీ, పూణే వారియర్స్‌, రైజింగ్‌ పూణే జెయింట్స్‌ తరఫున 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.

కాగా, గత బెంగాల్‌ ప్రభుత్వంలోనూ మనోజ్‌ తివారి అనే టీమిండియా, కేకేఆర్‌ మాజీ క్రికెటర్‌ క్రీడా మంత్రిగా వ్యవహరించాడు. అతడు తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన కొంతకాలం పాటు క్రీడా శాఖను పర్యవేక్షించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement