
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 15) తెల్లవారు జామున ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగింది. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్‌ను ఝులిపించలేదు. బౌలర్ల ఆధిపత్యం నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్‌పై ఫాల్కన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. వకార్ సలాంఖిల్ (4-0-22-4), నసీం షా (3.1-0-20-2), ఫజల్ హక్ ఫారూకీ (4-0-30-2), కైల్ మేయర్స్ (2-0-12-1) ధాటికి 17.1 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో కరీమా గోరె (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇతను కూడా రాణించకపోయుంటే ఫాల్కన్స్ 100 పరుగుల లోపే ఆలౌటయ్యేది.
ఫాల్కన్స్ జట్టులో రకీమ్ కార్న్‌వాల్, బెవాన్ జాకబ్స్, ఫేబియన్ అలెన్, షకీబ్ అల్ హసన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లున్నా ఒక్కరూ బ్యాట్ ఝులిపించలేకపోయారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ 15 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పేట్రియాట్స్ బ్యాటర్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. ఎవిన్ లూయిస్ 25, ఆండ్రీ ఫ్లెచర్ 19, కైల్ మేయర్స్ 15, అలిక్ అధనాజ్ 37 నాటౌట్, జేసన్ హోల్డర్ 18 నాటౌట్ పరుగులు చేశారు.
విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సో డకౌటై నిరాశపరిచాడు. ఈ జట్టులో కూడా అందరూ మెరుపు వీరులే ఉన్నా ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫాల్కన్స్ బౌలర్లలో కార్న్‌వాల్ 2, ఘజన్‌ఫర్, మెక్‌కాయ్ తలో వికెట్ తీశారు.