Ind Vs Aus 3rd Test: మూడో టెస్టు పిచ్‌ ఎలా ఉండబోతోంది? ఫొటో వైరల్‌

BGT 2023 Ind Vs Aus 3rd Test: Images Of Indore Wicket Goes Viral - Sakshi

Australia tour of India, 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇండోర్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసులో తలమునకలయ్యారు.

ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు పిచ్‌ల గురించి రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తదితరులు నాగ్‌పూర్‌ను పిచ్‌ను పరిశీలిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు.

పిచ్‌పై ఆసీస్‌ నిందలు
ఇందుకు తోడు.. క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం ‘డాక్టర్డ్‌ పిచ్‌’ అంటూ ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా రూపొందించుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్ల విజృంభణతో టీమిండియా గెలుపొందడం వారి అసహనాన్ని మరింత పెంచింది.

అయితే, భారత స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ బ్యాట్‌తోనూ రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వేళ.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్లు వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా వంటి వాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో పిచ్‌పై నిందలు వేసే పనిలో పడి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆటపై దృష్టి పెట్టలేకపోయారంటూ విమర్శల పాలయ్యారు.

అలా అయితే నయమే!
ఈ క్రమంలో మూడో టెస్టుకు సంబంధించి ఎలాంటి పిచ్‌ను రూపొందిస్తారా అన్న అంశం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం పిచ్‌ తయారీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వీటిని గమనిస్తే పిచ్‌  ఎలాంటి పగుళ్లూ లేకుండా, కాస్త పచ్చగా కనిపిస్తోంది. మ్యాచ్‌ సమయానికి ఇలాగే ఉంటే బ్యాటర్లకు కాస్త అనుకూలిస్తుంది. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భారీ స్కోర్లు నమోదు కాలేదన్న సంగతి తెలిసిందే.

తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ(120) చేయగా.. మిగతా వాళ్లలో ఎవరూ 100 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఇరు జట్ల స్పిన్నర్లు మొత్తంగా తొలి టెస్టులో 24.. రెండో టెస్టులో 28 వికెట్లు పడగొట్టారు.

చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్‌ బ్యాటర్‌ వల్లేనన్న ఆజం ఖాన్‌! ‘స్కై’తో నీకు పోలికేంటి?
T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ఒకే ఒక్కరు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top