గీత దాటితే వేటు! | BCCI Warns IPL Teams Over Rule Breaches, Says Strict Actions | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటు!

May 9 2026 6:20 AM | Updated on May 9 2026 6:27 AM

BCCI Warns IPL Teams Over Rule Breaches, Says Strict Actions

ఆటగాళ్లు, అధికారులకు బీసీసీఐ హెచ్చరిక
పలు సూచనలతో ఫ్రాంచైజీలకు లేఖ  

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు వివాదాస్పద ఘటనల నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ‘క్రమశిక్షణారాహిత్యం, నిబంధనల ఉల్లంఘన’ జరుగుతోందంటూ బోర్డు అవినీతి నిరోధక విభాగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు, అధికారులతో పాటు పది ఫ్రాంచైజీలను కూడా హెచ్చరించింది. 

లీగ్‌ సాగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ప్రత్యేక సూచనలతో కూడిన నియమావళిని జారీ చేసింది. ఇటీవలి పలు పరిణామాలు ఐపీఎల్‌కు చెడ్డ పేరు తెస్తున్నాయని, వీటిని నిలువరించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించింది. తాజా సూచనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదా తరచుగా పర్యవేక్షించనున్నారు. ఏదైనా తప్పు తేలితే షోకాజ్, జరిమానా మొదలు ఐపీఎల్‌ నుంచి నిషేధించే అవకాశం కూడా ఉంది. ఏ ఫ్రాంచైజీ లేదా ఆటగాడి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా... క్రమశిక్షణ ఉల్లంఘనకు కారణమవుతున్న పలు 

అంశాలను బోర్డు ప్రస్తావించింది. వీటిలో కొన్ని...  
1. ఆటగాళ్ల గదుల్లోకి అనుమతి లేని వ్యక్తుల ప్రవేశంపై నిషేధం: టీమ్‌ మేనేజర్‌ అనుమతి లేకుండా పలువురు ఆటగాళ్లు, అధికారులు తమ గదుల్లోకి బయటి వ్యక్తులను అనుమతించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని వల్ల వారిని ఉచ్చులోకి బిగించి తప్పుడు పనుల కోసం ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. ఇకపై కుటుంబ సభ్యులైనా సరే మేనేజర్‌ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. లేదంటే హోటల్‌ లాబీలోనే కలవాలి.  

2. మ్యాచ్‌ సమయంలో ఫ్రాంచైజీ యజమానులు కూడా దూరంగా ఉండాలి: కొందరు ఫ్రాంచైజీ యజమానులు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే క్రికెటర్లతో మాట్లాడుతూ, కబుర్లు చెబుతూ కనిపిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇకపై ఇది పూర్తిగా నిషేధం. డగౌట్, డ్రెస్సింగ్‌ రూమ్‌లతో పాటు మైదానంలోకి కూడా యజమానులు మ్యాచ్‌ పూర్తి కాక ముందు ఎవరూ రాకూడదు.  

3. అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదు: చాలా మంది క్రికెటర్లు, అధికారులు వేళాపాళా లేకుండా హోటల్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇది చాలా రకాల సమస్యలకు కారణమవుతోంది. ఇకపై అలా కుదరదు. సెక్యూరిటీ లైజన్‌ ఆఫీసర్‌ లేదా టీమ్‌ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు సమాచారం అందించి వారి అనుమతితోనే వెళ్లాలి.  

4. వేపింగ్‌పై నిషేధం: రియాన్‌ పరాగ్‌ ఉదంతం నేపథ్యంలో ‘వేపింగ్‌’పై బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భారతీయ చట్టాల ప్రకారం ఇ–సిగరెట్లు, వేపింగ్‌పై నిషేధం ఉంది. వీటితో పాటు నిషేధంలో ఉన్న ఎలాంటి వస్తువులను కూడా ఆటగాళ్లు ఉపయోగించరాదు.  

 

Advertisement
 
Advertisement
Advertisement