పసికూనపై బంగ్లాదేశ్‌ ప్రతాపం: పదేళ్ల తర్వాత తొలిసారి ఇలా.. | Bangladesh Beat Netherlands in 1st T20 Biggest Win At home in 10 years | Sakshi
Sakshi News home page

పసికూనపై బంగ్లాదేశ్‌ ప్రతాపం: చెలరేగిన టస్కిన్‌ అహ్మద్‌.. లిటన్‌ దాస్‌, సైఫ్‌ మెరుపులు

Aug 30 2025 9:32 PM | Updated on Aug 30 2025 9:32 PM

Bangladesh Beat Netherlands in 1st T20 Biggest Win At home in 10 years

టస్కిన్‌ అహ్మద్‌- లిటన్‌ దాస్‌

సొంతగడ్డపై నెదర్లాండ్స్‌ (BAN vs NED)తో టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. సైల్హెట్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20లు ఆడే నిమిత్తం నెదర్లాండ్స్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చింది.

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శనివారం నాటి తొలి టీ20లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్‌.. బంగ్లా బౌలర్ల విజృంభణ నేపథ్యంలో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.

ఫర్వాలేదనిపించిన మాక్స్‌, తేజ
ఓపెనర్లలో మాక్స్‌ ఒడౌడ్‌ (15 బంతుల్లో 23) రాణించగా.. విక్రమ్‌జిత్‌ సింగ్‌ (11 బంతుల్లో 4) తేలిపోయాడు. ఈ ఇద్దరి వికెట్లను బంగ్లా పేసర్‌ టస్కిన్‌ అహ్మద్‌ (Taskin Ahmed) దక్కించుకున్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన తేజ నిడమానూరు (26 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ ఎడ్‌వర్డ్స్‌ (12), షారిజ్‌ అహ్మద్‌ (15), నోవా క్రోస్‌ (11), కైలే క్లెన్‌ (9), టిమ్‌ ప్రింగ్లే (9) విఫలమయ్యారు. ఆఖర్లో ఆర్యన్‌ దత్‌ (8 బంతుల్లో 13) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు.

ఇక బంగ్లా బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌ మొత్తంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. సైఫ్‌ హసన్‌ రెండు, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో పర్వేజ్‌ హుసేన్‌ ఇమాన్‌ (15) అవుట్‌ కాగా.. టిమ్‌ ప్రింగ్లే మరో ఓపెనర్‌ తాంజిద్‌ హసన్‌ తమీమ్‌ (29) వికెట్‌ను దక్కించుకున్నాడు.

లిటన్‌ దాస్‌ మెరుపు అర్ధ శతకం.. సైఫ్‌ హసన్‌ ధనాధన్‌
ఈ ‍క్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ మెరుపు అర్ధ శతకంతో దుమ్ములేపాడు. 29 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో లిటన్‌ దాస్‌ 54 పరుగులతో అజేయంగానిలిచాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్‌ సైఫ్‌ హసన్‌ రాణించాడు. కేవలం 19 బంతుల్లోనే 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. లిటన్‌ దాస్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక 13.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌.. పసికూన నెదర్లాండ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టిన టస్కిన్‌ అహ్మద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

పదేళ్ల తర్వాత..
కాగా పదేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే అతిపెద్ద (బాల్స్‌ పరంగా) విజయం. 2014లో ఢాకా వేదికగా టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 48 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా గెలుపొందింది. తాజాగా 39 బంతులు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది.

చదవండి: వైభవ్‌? ఆయుశ్‌ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement