Asia Badminton Championship: చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. 52 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం ఖాయం

Asia Badminton Championship: Satwik, Chirag Confirms Medal - Sakshi

దుబాయ్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–11, 21–12తో అహసాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) జోడీని ఓడించింది.

ఈ గెలుపుతో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని ఖరారు చేసుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ పీవీ సింధు 21–18, 5–21, 9–21తో ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది.

కాంటా సునెయామ (జపాన్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 9–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 18–21, 21–19, 15–21తో దెజాన్‌–గ్లోరియా విద్‌జాజా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top