#ThirdUmpireCheating: అది నోబాల్‌.. థర్డ్‌ అంపైర్‌ చీటింగ్‌

Abdul Samad- Klaasen-Shocks-3rd-Umpire Cheating Not Giving No-Ball  - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌(LSG)మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నో బాల్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన తీరుపై స్టేడియానికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవ్వడం ఆసక్తి కలిగించింది.

విషయంలోకి వెళితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. ఓవర్‌ మూడో బంతి హైఫుల్‌ టాస్‌గా వెళ్లింది. నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్‌ అంపైర్‌ కాల్‌ను చాలెంజ్‌ చేశారు.

దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ బంతి సమద్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి వెళ్లిందని.. నో బాల్‌ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్‌ సహా అబ్దుల్‌ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్‌ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్‌ అని కనిపిస్తున్నా థర్డ్‌ అంపైర్‌ కరెక్ట్‌ బాల్‌గా కౌంట్‌ చేయడం ఆసక్తి కలిగించింది. 

ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు కోపం తెప్పించింది. థర్డ్‌ అంపైర్‌ని తిడుతూనే ఎల్‌ఎస్‌జీ డగౌట్‌ వైపు కొంతమంది అభిమానులు నట్స్‌, బోల్ట్‌లు విసిరికొట్టారు. అవి వచ్చి డగౌట్‌లో పడడంతో గందరగోళం నెలకొంది. దీంతో లక్నో ఆటగాళ్లంతా డగౌట్‌వైపుగా రావడం.. క్లాసెన్‌, క్వింటన్‌ డికాక్‌లు నోబాల్‌ వ్యవహారంపై సీరియస్‌గా చర్చించడం కనిపించింది. అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారు పడిన వేళ అంపైర్లు కలగజేసుకొని డగౌట్‌ నుంచి ఆటగాళ్లను పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన తర్వాత క్లాసెన్‌ ఏకాగ్రత కోల్పోయాడు. 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్న క్లాసెన్‌ అదే ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రేరక్‌ మన్కడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌ వెళ్లే సమయంలో క్లాసెన్‌ మొహం బాధతో నిండిపోవడం కనిపించింది.

చదవండి: సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్‌ టెండూల్కర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top