
టైటాన్స్ మ్యాచ్‌లో అదరగొట్టిన భువీ డబ్ల్యూటీసీ ఫైనల్లో!?
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత మీ, నా మదిలో ఓ ప్రశ్న మెదలడం ఖాయం కదా! అదేంటంటే.. సర్రే ఓవల్‌లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టును ఫైనల్ చేసేటపుడు భువీని పరిగణనలోకి తీసుకుంటారా?
ఇంగ్లండ్‌లో వేసవి తొలి అర్ధ భాగంలో ఆడే మ్యాచ్‌లలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే స్వింగ్ రాబట్టాల్సిందే. ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సగం సగమే అనిపిస్తున్నాడు.
జయదేవ్ ఉనాద్కట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి భువనేశ్వర్ కుమార్‌ను జట్టుకు ఎంపిక చేస్తారా? చేస్తే బాగుండు. కానీ అలా జరుగకపోవచ్చు.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
5 వికెట్లతో చెలరేగిన భువీ!
స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆకాశ్.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని నిట్టూర్చాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు.
టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (0), శుబ్‌మన్ గిల్(101), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8), టెయిలెండర్లు నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ(0) వికెట్లు కూల్చాడు. 4 ఓవర్ల బౌలింగ్‌లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే!
ఈ మ్యాచ్‌లో రైజర్స్ ఓడినప్పటికీ భువీ ప్రదర్శన మాత్రం సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. భువీని కొనియాడుతూనే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడికి ఆడే అవకాశం వస్తే బాగుండని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై భువీ లాంటి స్వింగ్ మాస్టర్ అద్భుతాలు చేయగలడని పేర్కొన్నాడు. అయితే, సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు.
కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7- 11 వరకు ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో బీసీసీఐ భువీకి చోటివ్వని సంగతి తెలిసిందే.
చదవండి: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్! తుది జట్టులో..
A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass!
— JioCinema (@JioCinema) May 15, 2023
#GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea