● మంత్రి పొన్నం ప్రభాకర్
● అధికారులతో టెలీకాన్ఫరెన్స్
హుస్నాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండటంతో అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. మిల్లుల వద్ద, ధాన్యం తరలింపులో వాహనాల సమస్య, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం అధికంగా వచ్చే కేంద్రాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక నుంచి రోజు విడిచి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఎస్‌ఓలు, డీఎం, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


