పైసలేవీ? | - | Sakshi
Sakshi News home page

పైసలేవీ?

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

ఐదు నెలల కిందటే బిల్లులిచ్చినా..

రాగానే చెల్లిస్తాం

ఎన్నికల

ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా రాని డబ్బులు

నాడు అప్పులు తెచ్చి పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పన

అయోమయంలో పంచాయతీ కార్యదర్శులు

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన డబ్బులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు దాదాపు రూ.5.07 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.4 కోట్లే చెల్లించారు. ఇంకో రూ.కోటి వరకు చెల్లింపులు పెండింగ్‌లో ఉండగా, అందులో ఎక్కువ భాగం గ్రామ పంచాయతీ కార్యదర్శులకే ఉండటం గమనార్హం. మరో పది రోజుల్లో కార్యదర్శులకు బదిలీలు ఉండటంతో పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట

జిల్లా వ్యాప్తంగా మూడు దశలలో డిసెంబర్‌11, 14, 17వ తేదీలలో 508 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాయి. ఓ గ్రామ పంచాయతీలో 12 వార్డులున్న వాటికి దాదాపు 50 మంది పోలింగ్‌ సిబ్బంది విధులకు హాజరయ్యారు. వారికి ముందు రోజు బస, భోజనం, పోలింగ్‌ నాడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీలను పంచాయతీ కార్యదర్శులే ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు కుర్చీలు, టేబుల్స్‌ సమకూర్చారు. ఇందుకు దాదాపు రూ.25వేలు వెచ్చించారు. కానీ ఆ కార్యదర్శికి ఇప్పటి వరకు మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) రూ. 10వేలు అందించారు. అదే చిన్న గ్రామ పంచాయతీలకు రూ.18వేలు ఖర్చు అయితే రూ.8వేలు చెల్లించారు. అదేమంటే, ఇంకా నిధులు రావాల్సి ఉందని సమాధానం చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు మండలాల పరిఽధిలో పలువురు వీడియో గ్రాఫర్లకు సైతం డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.

మరో పది రోజుల్లో బదిలీలు

జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులు వస్తాయా? లేదా? అని వారు అందోళన చెందుతున్నారు. కొందరు జీతం డబ్బుల, మరికొందరు అప్పు తెచ్చి ఎన్నికల నిర్వహణ కోసం వెచ్చించారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నారు. బదిలీలు అయితే డబ్బులు ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల నిర్వహణలో పని చేసివారు కోరుతున్నారు.

ఎంపీడీఓల ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కనుక వారికి డబ్బులు ఎప్పుడు ఇచ్చినా ఏమీ కాదు అనే ధోరణిలో పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద మండలాలకు ఎక్కువ, చిన్నవైతే తక్కువ మొత్తాన్ని ఉన్నతాధికారులు ఎంపీడీఓల ఖాతాలలో జమ చేశారు. పంచాయతీ వారీగా విభజిస్తే అర కొర నిధులే వచ్చాయి. పోలింగ్‌ ఖర్చుల వివరాలను బిల్లులతో సహా పంచాయతీ కార్యదర్వులు ఐదు నెలల కిందటే ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించారు.

ఎన్నికల నిర్వహణ కోసం రూ.5.07 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వం నుంచి రూ.4కోట్లు వచ్చాయి. ఇంకా రూ.1.07కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అవి విడుదల కాగానే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగనున్నాయి.

– రవీందర్‌, ఇన్‌చార్జి డీపీఓ

Advertisement
 
Advertisement
Advertisement