పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

● వర్చువల్‌గా స్మార్ట్‌ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు

ప్రధాని మోదీ
● వర్చువల్‌గా స్మార్ట్‌ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు

జహీరాబాద్‌/ఝరాసంగం(జహీరాబాద్‌): జహీరాబాద్‌ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక పట్టణంగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్‌లోని నిమ్జ్‌ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌ ప్రాంతం నిర్మాణం వెనుక ఇదే లక్ష్యం ఉందన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వికసితానికి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల వాటా ఉందన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యవంతమైన విద్యుత్‌ సరఫరా, అత్యాధునిక హైసిటీ నెట్‌వర్క్‌ కూడా ఉండనుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే పరిశ్రమల అవసరాల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ తయారుకానున్నాయని తెలిపారు. ఇలాంటి సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేలకోట్లు అవసరమవుతాయని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్‌ ప్రాంతంలోని వేలాది యువకులకు జహీరాబాద్‌ ప్రాంతం జాబ్‌ హబ్‌గా తయారుకానుందని వివరించారు. నిమ్జ్‌లో తయారయ్యే వాహనాలు, యంత్రాలతోపాటు ఇక్కడ ఉండే ఆహారశుద్ధి ఉద్యోగులకు, తెలంగాణలోని కార్మికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుందన్నారు.

ఝరాసంగం–న్యాల్‌కల్‌ పరిధిలో స్మార్ట్‌సిటీ

ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల పరిధిలో స్మార్ట్‌ సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాలు,న్యాల్‌కల్‌ మండలంలోని 17 గ్రామాల పరిధిలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్‌) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి అమలు ట్రస్ట్‌ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్‌లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇక వేగంగా స్మార్ట్‌సిటీ పనులు

నిమ్జ్‌ ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మార్ట్‌ సిటీ పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇక పనుల్లో జోరు పెరగనుంది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,369 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్ట నున్నారు. హైదరాబాద్‌–నాగపూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వర్క్‌లో భాగంగా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రకటించింది. బర్దిపూర్‌లో ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమంలో నిమ్జ్‌ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, జోనల్‌ మేనేజర్‌ విఠల్‌, రూరల్‌ సీఐ హనుమంతు, ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ మేనేజర్‌ విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement