ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని లలిత చంద్రమౌళీశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం అలరించింది. అవధాని శరత్‌కుమార్ శర్మ పద్యాలతో ఆకట్టుకున్నారు. పృచ్చకులుగా నిషిద్ధాక్షరి పెందోట వెంకటేశ్వర్లు, వర్ణన ఉండ్రాళ్ల రాజేశం, సమస్య కాల్వ రాజయ్య, దత్తపది దుడుగు నాగలత, ఆశువు మచ్చ అనురాధ, వ్యస్తాక్షరి నల్ల అశోక్ తదితరులు అడిగిన అంశాలపై వజ్జల శరత్ కుమార్ శర్మ పద్యాలు అప్పటికప్పుడే చెప్పారు. తెలుగు భాషలో అవధానం గొప్పదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ అన్నారు.
సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న టీఎస్‌ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 52 మందికి 52 మంది హాజరయ్యారు. పరీక్షలను ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ సింగిత్ సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
గజ్వేల్‌రూరల్: కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేలా లేబర్ కోడ్‌లు ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్‌కోడ్‌లు వ్యతిరేకిస్తూ, నూతనంగా నోటిఫై చేసిన రూల్స్ ప్రతులను ఆదివారం గజ్వేల్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన కోడ్‌ల వల్ల కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పోతాయని, పనిగంటల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కరువవుతుందని అన్నారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకొని కార్మికులకు మేలు చేసేలా చట్టాలను రూపొందించాలని, లేనిపక్షంలో కార్మికవర్గం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, నాయకులు బండ్ల స్వామి, వేణుగోపాల్, సుధాకర్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్‌రావు, భూపతి, పర్శరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాగు నీరు వృథా
చిన్నకోడూరు (సిద్దిపేట): మండలంలోని మెట్టుబండల నుంచి చంద్లాపూర్ వెళ్లే రహదారి పక్కన పైపులైన్ లీకేజీ అయి తాగు నీరు వృథాగా పోతోంది. అరికట్టాల్సిన యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. లీకేజీలతో నీరు కలుషితమై అదే నీరు ప్రజలు తాగుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యార్థినికి
రూ.లక్ష బహుమతి
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మోకు హారిక ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించిన లక్ష రూపాయల నగదు బహుమతికి ఎంపికై నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 994 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సోమవారం ఆ విద్యార్థినికి పారితోషికాన్ని అందించి సన్మానిస్తారని తెలిపారు. హారికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలని పిలుపునిచ్చారు.


