● సిబ్బందికి సహకరించాలి
● నేటినుంచి ఇంటింటికీ ఎన్యూమరేటర్లు
● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: జనగణన ప్రక్రియ చాలా కీలకమని, ఇందులో భాగస్వామ్యం అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరిదని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల మైదానంలో మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కచ్చితమైన గణాంకాల రూపకల్పనకు జనగణన కీలకమన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో జనగణన జరుగుతోందన్నారు. కోవిడ్ కారణంగా 2021లో జరగలేదని, స్వాతంత్య్ర సిద్ధించిన తరువాత ఇది 16వ జనగణన అని అన్నారు. మన రాష్ట్రంలో ఇది మొదటి జనగణన అని, మొదటి సారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 10తో స్వీయగణన పూర్తి అయ్యిందని, సోమవారం నుంచి జిల్లాలో ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. వారికి శిక్షణ అందించినట్లు, ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. జనగణన పేరిట ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్‌లో పొందిపర్చిన వారి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ ర్యాలీ ముస్తాబాద్ చౌరస్తా, మెదక్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు హమీద్, రామస్వామి, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


