స్వీయగణన అంతంతే! | - | Sakshi
Sakshi News home page

స్వీయగణన అంతంతే!

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

● జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మందే నమోదు ● నేటితో ముగియనున్న గడువు ● రేపటి నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ షురూ..

● జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మందే నమోదు ● నేటితో ముగియనున్న గడువు ● రేపటి నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ షురూ..

సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జన గణన చేపడుతోంది. ఇందుకోసం అన్ని సిద్ధం చేస్తోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించకముందే ప్రజలు ఆన్‌లైన్‌లో వివరాలు సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కల్పించారు. కానీ స్వీయ గణనకు స్పందన అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటి వరకు 11,115 కుటుంబాలు మాత్రమే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. ప్రజలకు స్వీయ గణనపై సరైనా అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు దీనిని వినియోగించుకోలేదని తెలుస్తోంది.

3.31 లక్షల కుటుంబాలు

సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ–రాజకీయ, కుల సర్వే(ఎస్‌ఈఈఈపీసీ–2024) వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,31,438 కుటుంబాలున్నాయి. 10,30,453 జనాభా ఉన్నారు. జనాభా గణన–2027 కోసం జిల్లా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు 1,970, సూపర్‌వైజర్లు 345 మందికి శిక్షణ పూర్తి అయింది. వీరు రేపటి (ఈ నెల11 తేదీ) నుంచి జూన్‌ 9వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో స్వీయ గణనను చేసుకోని గృహాల గుర్తింపును చేయనున్నారు.

3.5 శాతం మాత్రమే..

స్వీయగణనపై జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంది. జిల్లాలో 3.31లక్షల కుటుంబాలుంటే కేవలం 3.5 శాతం మంది మాత్రమే స్వీయ గణన చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల కుటుంబాలే దాదాపు 6వేలకుపైగా ఉంటారు. విద్యావంతులు, రాజకీయ నాయకులు చాలా వరకు ఉంటారు. కానీ పలువురి నిర్లక్ష్యమా.. లేదంటే తెలియక ముందుకు రాలేదా అని తెలుస్తోంది.

నేడు ఆఖరు

స్వీయ గణన ఆదివారంతో ముగియనుంది. స్వీయ గణన నమోదులో సందేహాలుంటే టోల్‌ ఫ్రీ నంబరు 1855లో సంప్రదించాలి. ఎవరికి వారు మాతృబాషలోనూ వివరాలు పొందుపర్చొచ్చు. యజమాని పేరు తప్పుగా రాయొద్దు.

డిజిటల్‌ పద్ధతిలో..

దేశ వ్యాప్తంగా డిజిటల్‌ పద్ధతిలో జన గణన జరగనుంది. మొదట ఇళ్ల గుర్తించి జాబితాను సిద్ధం చేస్తారు. తర్వాత జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దీనిని పర్యవేక్షించేందకు జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయిలో బాధ్యులను నియమించారు. స్మార్ట్‌ ఫోన్లలో జనగణన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలను నమోదు చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో.. ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేయనున్నారు. వివరాలన్నింటిని యాప్‌లోనే నిక్షిప్తం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉండటం చాలా తక్కువ కనుక ఆఫ్‌లైన్‌ నమోదుకు సైతం అవకాశం కల్పించింది.

పకడ్బందీగా ప్రక్రియ

ఇప్పటికే ఎన్యూమరేటర్ల శిక్షణ పూర్తి అయింది. స్వీయగణన ఈ నెల 10న ముగియనుంది. ఈ నెల 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పకడ్బందీగా చేపడతాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయనున్నారు. – రాజ్‌కుమార్‌, ఏఓ, కలెక్టరేట్‌

Advertisement
 
Advertisement
Advertisement