● పొద్దుతిరుగుడు, మక్కలు కొనరేం ● మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి టైమ్ ఉంది.. కానీ రైతులకు గన్నీ సంచులు సరఫరా చేసేందుకు టైమ్ దొరకడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం చిన్నకోడూరులోని పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 40 రోజులుగా పొద్దు తిరుగుడు కొనలేదని రైతులు చెప్పడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఫోన్ చేసి, పొద్దు తిరుగుడు రైతు సమస్యలు వివరించారు. కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వివరించారు. కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కనీసం ఒక్కసారి ఏ పల్లెలోనైనా వడ్ల కుప్పల దగ్గరకు పోయి రైతుల బాధలు వినలేదన్నారు. మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలేదని, ఢిల్లీకి ఉత్తరాలు రాశామని కాలయాపన చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. నెలల తరబడి వడ్లు కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి పట్టడంలేదన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని, యూరియా అడిగితే యాప్ అంటున్నారని, రైతులు పండించిన పంటలు కొనడంలేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ మూసీ, ఫ్యూచర్ సిటీ కోసం మీటింగ్‌లు పెడుతున్నారే తప్ప ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్ల మీద ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, శనిగలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.


