విహాన్‌రామ్‌కు డీజీపీ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

విహాన్‌రామ్‌కు డీజీపీ అభినందనలు

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

మద్దూరు(హుస్నాబాద్‌): అంతర్జాతీయ బాల పర్వతారోహకుడు మాస్టర్‌ జాటోత్‌ విహాన్‌రామ్‌ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. ఇటీవల అస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్‌ కోషియాస్కోని విజయవంతంగా అధిరోహించడంతో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో విహాన్‌రామ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో ఆఫ్రికాలోని కిలిమెంజోరో, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాతాల్సు, ఆస్ట్రేలియాలోని కోషియాస్కో పర్వతాలను అధిరోహించడం మన రాష్ట్రనికి దేశానికి గర్వకారణమని అన్నారు. మాదకద్రవ్యాలు వద్దు అనే నినాదంతో ఎంచుకోని పద్వతాలను అధిరోహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించినట్లు విహాన్‌రామ్‌ తండ్రి తిరుపతి తెలిపారు.

ప్రశాంతంగా ఎప్‌సెట్‌

సిద్దిపేటఅర్బన్‌: టీఎస్‌ఎప్‌సెట్‌లో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్ష శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్‌కు 50 మంది విద్యార్థులకు గాను 50 మంది హాజరు కాగా మధ్యాహ్నం సెషన్‌కు 48 మంది హాజరయ్యారు. ఆదివారం, సోమవారం సైతం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీపీ రాజు, అబ్జర్వర్‌ భాస్కర్‌, టీసీఎస్‌ ఆఫీసర్‌ సింగిత్‌ సింగ్‌, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్‌ షాదుల్లా పర్యవేక్షించారు.

ఉద్యోగాల కల్పనలో

మోదీ విఫలం

హుస్నాబాద్‌: ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జనగామ రాజ్‌కుమార్‌ ఆరోపించారు. శనివారం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో జరిగిన సమావేశంలో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రధాన హామీలు ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని రాజకీయ లాభాలు పొందడమే తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏమీలేదన్నారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు చంద్రశేఖర్‌, రేవతి, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

ట్రిపుల్‌ఐటీ దరఖాస్తుకు

నేడే తుది గడువు

సంగారెడ్డి క్రైమ్‌: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని బాసర (ట్రిపుల్‌ ఐటీ)లో 2026–2027 విద్యా ఏడాది లో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఏడాది 180 సీట్లు కేటాయించారు. ఆరేళ్ల బీటెక్‌ సమీకృత కోర్సుల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు సాధించిన ప్రతిభ మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి రెసిడెన్షియల్‌ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలను సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తులను మీసేవ, ఈ సేవ, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ,బీసీ అభ్యర్థులు దరఖాస్తు రూ.500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. విద్యార్థులు 2026 ఎస్‌ఎస్‌ఎస్సీ పరీక్షలు రెగ్యులర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 10–05–2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు.

Advertisement
 
Advertisement
Advertisement