పోలీస్ కమిషనర్ ఎస్‌ఎం రష్మీ పెరుమాళ్ ‘సాక్షి’తో అమ్మ అనుబంధాన్ని పంచుకున్న సీపీ
సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. కరుణ, త్యాగానికి
ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం..
ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు
ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలోనిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా..
అందుకో మా వందనం.
సాక్షి, సిద్దిపేట: ‘సివిల్ సర్వీస్‌లోకి రావడం అమ్మ ప్రోత్సాహమే.. నాన్న ఆర్మీలో పని చేస్తున్న క్రమంలో టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందారు. అప్పటి నుంచే అమ్మే ఇంటి బాధ్యతలు చేపట్టి ఇంతటి వారిని చేశారు.’ అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్‌ఎం రష్మీ పెరుమాళ్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మతో అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. సీపీ మాటల్లోనే..
మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. నేను సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది అమ్మ కోరిక. అమ్మ డ్రీమ్‌ను 2019లో నెరవేర్చా. సివిల్స్ సర్వీస్ కోసం ఐదు మార్లు రాశా. నాలుగు మార్లు మంచి ర్యాంక్ రాకున్నా అమ్మ నన్ను ప్రోత్సహించారు. ఐదో సారి 216 ర్యాంక్ రావడంతో అమ్మ సంతోషానికి హద్దులు లేవు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా అమ్మ చలువే.
మాది హైదరాబాద్.. అమ్మానాన్నలు గీతా, కల్నల్ మాధవ్ పెరుమాళ్. అన్నయ్య జయంత్. నాన్న ఇండియన్ ఆర్మీలో పని చేసేవారు. ఆర్మీలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అస్సాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 2009లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మనే ఇంటి బాధ్యతలు చూశారు. అన్నయ్య, వదిన సైతం ఆర్మీలో డాక్టర్లుగా పని చేస్తున్నారు.
ఎక్కువ కాలం హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చేసిన పప్పన్నం చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అమ్మ వండిన వంటలే ఇష్టంగా తింటున్నా. కరీంనగర్‌లో ప్రొబిషనరీ ఏసీపీగా, మంచిర్యాల, వైరా, కుషాయిగూడలలో ఏసీపీగా, అదనపు డీసీపీగా రాజేంద్రనగర్, నార్త్‌జోన్ డీసీపీగా అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చాను.


