● 26 నుంచి రాష్ట్ర కమిటీ సమావేశాలు
● సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు
సిద్దిపేటఅర్బన్: దేశంలో ఫాసిస్టు శక్తులు విస్తరిస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అతిముఖ్యమైన రాజకీయ కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. స్థానిక కార్మిక, కర్షక భవన్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 26 నుంచి 28 వరకు జరగనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక శక్తులను సమీకరించి విశాల ఉద్యమాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశాల ఉద్దేశ్యమన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ శక్తుల బలోపేతం కోసం ఐక్యపోరాటాలు నిర్మించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయ రాఘవన్, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. సమావేశాల ఆహ్వాన సంఘం చైర్మన్‌గా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఆముదాల మల్లారెడ్డి, కోశాధికారిగా గోపాలస్వామి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా మరో 17 మందిని ఎన్నుకున్నారు.


